సిద్దిపేట.. కొత్త బాట
సిద్దిపేట జోన్: స్వచ్ఛభారత్ కింద సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించి ‘స్వచ్ఛ సిద్దిపేట’గా గుర్తింపు.. వంద శాతం ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంతో తెలంగాణకే ఆదర్శం.. తాజాగా ‘అమృత్’ పథకం కింద ఎంపిక.. వరుస ఘనతలు సాధిస్తున్న సిద్దిపేట పట్టణానికి మరోసారి అరుదైన గుర్తింపు దక్కింది. స్వచ్ఛ భారత్‌పై డాక్యుమెంటరీ చిత్రీకరణకు సిద్దిపేట ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్.. సిద్దిపేటను మరోసారి గుర్తించింది.
ఇటీవలే ఢిల్లీకి చెందిన ఈ మిషన్ బృందం పట్టణంలో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించిన విష యం తెలిసిందే. ఈ బృందం అందచేసిన నివేదిక ఆధారంగా స్వచ్ఛ భారత్ మిషన్ డెరైక్టర్ ప్రవీణ్‌ప్రకాశ్.. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్‌పై డాక్యుమెంటరీకి రెండు పట్టణాలను గుర్తించారు. వాటిలో మొదటి స్థానం వరంగల్ కార్పొరేషన్‌కు దక్కగా, మలి స్థానం సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి దక్కింది.
అందరి చూపు ఇటువైపే..
ఇప్పటికే దేశస్థాయిలో స్వచ్ఛ భారత్ విషయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అందుకు కారణమైన పట్టణాల్లో సిద్దిపేట ఒకటి. ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలను సైతం ఆకర్షిస్తున్నాయి. వాటిని స్వచ్ఛ భారత్ మిషన్ డాక్యుమెంటరీగా చిత్రీకరించనుంది. మిషన్ డెరైక్టర్ ప్రవీణ్‌ప్రకాశ్ ఆదేశాల మేరకు బుధవారం ఒక బృందం సిద్దిపేటను సందర్శిం చింది. దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై డాక్యుమెంటరీని చిత్రీకరించింది. దీన్ని త్వరలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఎదుట షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో ప్రదర్శిస్తారు.
ఏమేం చిత్రీకరించారంటే..
మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ, తాగునీటి సరఫరా విధానాలను డాక్యుమెంటరీ బృందం చిత్రీకరించింది. నాలుగు గంటల పాటు ఐటీసీ హబ్, మందపల్లి డంప్‌యార్డు, కాంచిట్ వద్ద సులభ్ కాంప్లెక్స్‌ల నిర్వహణను కెమెరాలో బంధించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఇంత్యాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కృష్ణారెడ్డి, సత్యనారాయణతో పాటు చిత్రీకరణ బృందం ఉంది.
ఇవిగో ప్రత్యేకతలు..
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో కొంత కాలంగా తడి-పొడి చెత్త సేకరణను ఇంటింటి నుంచి పకడ్బందీగా చేపడుతున్నారు. ‘వావ్’ పథకం కింద తడి-పొడి చెత్తను విభజించి వాటి ద్వారా ఆదాయ వనరుల సమీకరణకు మున్సిపల్ ప్రణాళిక రూపొందించింది
పట్టణంలో పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించేందుకు మందపల్లి వద్ద డంప్‌యార్డును ఏర్పాటు చేసి తడి చెత్త ద్వారా వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని నిర్వహిస్తున్నారు ఐటీసీ హబ్ ద్వారా పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు సిద్దిపేట తాగునీటి పథకం ద్వారా పట్టణ ప్రజలకు రోజూ నీటిని సరఫరా చేస్తున్నారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సిద్దిపేట వంద శాతం లక్ష్యాన్ని సాధించింది.