సాక్షి, హైదరాబాద్ : స్వరం కూడా ఒక బురద.. అందులోనే పద్మాలు వికసిస్తాయని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ పైవిధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీకి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఎన్నో యేళ్లుగా తాను చేస్తున్నసాహితీ వ్యవసాయానికి ఒక గుర్తింపు దక్కిందని, తనను పరిచయం చేసిన కె. విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని తెలిపారు. సిరివెన్నెలకు పద్మశ్రీ ఎందుకివ్వాలో కేంద్రానికి చెప్పిన ప్రతి ఒక్కరికి తన నమస్సులు తెలియజేశారు. సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై తనను పాటలు రాయమని అడగకండని చెప్పేవాడినని, పద్యం రాయడం రానందు వల్ల పాట రూపంలో తన అనుభూతులను పంచుకనేవాడినని తెలిపారు. తన అనుభూతులన్నీ పాటలుగా రాసేవాడినని, కఠినమైన పాట రాసేంత భాష తనకు రాదని చెప్పుకొచ్చారు.
ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా తన పాటలు ఉండాలని అనుకున్నానని, తన ప్రతి పాటను అవార్డ్‌గానే భావిస్తానన్నారు. లాలిజో లాలిజో పాట.. గుమ్మాడి గుమ్మాడి.. పాటలు తన బాగా నచ్చుతాయన్నారు. అష్టయిశ్వర్యాలకంటే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమన్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ రాయమని వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందింగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment