పనుల తీరుపై స్మిత అసహనం
* 100 మంది కూలీలతో పని జరుగుతుందా?
* అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు
బాల్కొండ : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ఎందుకింత నిర్లక్ష్యమంటూ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులు మే చివరి నాటికి పూర్తి కావాలని అన్నారు. మంగళవారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే మండలంలోని జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నివేదికలో 300 మంది కూలీలు పని చేస్తున్నారంటు తెలుపుతున్నారు. కాని ఇక్కడ 100 మంది కూలీలు కూడ పని చేయడం లేదంటూ మండి పడ్డారు. ప్రతి రోజు 300 మంది కూలీలు పని చేయాల్సిన చోట 100 మంది కూలీలతో పని చేస్తే పనులు ఎలా ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తి చేయక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్ర స్థాయికి విరుద్ధంగా ఎందుకు నివేదికలు అందిస్తున్నారని అని అన్నారు.
వాటర్ గ్రిడ్ పనులను త్వరలో మళ్లీ పరిశీలిస్తానన్నారు. పనుల్లో వేగం పుంజు కోకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులను సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదన్నారు. పనులు సాగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ యోగితా రాణాతో ఆవేదన వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలన్నారు.