చైనాకు ప్రత్యామ్నాయం మనమే | Special Interview With Telangana Chapter Chairman Gummi Ram Reddy | Sakshi
Sakshi News home page

చైనాకు ప్రత్యామ్నాయం మనమే

Published Fri, May 8 2020 1:37 AM | Last Updated on Fri, May 8 2020 9:33 AM

Special Interview With Telangana Chapter Chairman Gummi Ram Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వేగంగా పురోగమిస్తున్న రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కరోనా లాక్‌డౌన్‌ సంక్షోభంలోకి నెట్టింది. వలస కార్మికులు సొంతూళ్లకు తిరుగు పయనం అవుతుండటం, ధరల పెరుగుదల వల్ల డెవలపర్లపై పెనుభారం పడనుంది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన సమయమిది. రిజిస్ట్రేషన్‌ రుసుము తగ్గింపు, రుణాలపై మారటోరియం గడువు పెంపు, తక్కువ వడ్డీకే గృహ రుణాలు వంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కరోనా నేపథ్యంలో చైనాకు భారత్‌ను అనేక దేశాలు ప్రత్యామ్నాయంగా చూస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగానికి దేశంలో ప్రత్యేకించి తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుంది’అని భారతీయ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ చాప్టర్‌ చైర్మన్, ఏఆర్‌కే çగ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం స్థితిగతులపై ఆయనతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ

► రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం రెండు మూడేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థి క మాంద్యం ఉన్నా మన రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం మంచి స్థాయిలో ఉండేది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఈ రంగంలో పనిచేస్తున్న 90 శాతం మంది వలస కూలీలు తమ భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారు. 
► లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత పనులకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు. దీంతో 40 రోజులకు పైగా వారికి రక్షణ కల్పిస్తూ, వేతనాలు, భోజన సదుపాయం కోసం లక్షల రూపాయలు వెచ్చించిన డెవలపర్లు ఆందోళనకు లోనవుతున్నారు. రైళ్లు నడుపుతున్నారనే విషయం తెలిసి సొంతూళ్లకు వెళ్లే ఆలోచన లేని వారు కూడా అనుమతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. వారిలో అధికంగా వలస కూలీలే ఉన్నారు. 
► వేసవిలో నిర్మాణ రంగం పనులు శరవేగంగా సాగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం ప్రారంభమైతే పనులకు అంతరాయం కలుగుతుంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి వ్యయం పెరిగే అవకాశం ఉంది. 
► నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉంది. వలస కార్మికులు తిరుగుముఖం పడితే ఎదురయ్యే సమస్యలను ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలసి వివరించాం. ప్రస్తుతమున్న కార్మికుల్లో విశ్వాసం నింపడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరాం. మా విజ్ఞప్తికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. 

► ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి మంచి సహకారం ఉంది. నోడల్‌ అధికారిని నియమించి, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా మా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్తున్న కార్మికులు తిరిగి వచ్చేందుకు మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశముంది. 
► కూలీలు, ధరల పరంగా రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రతి డెవలపర్‌ కోట్లాది రూపాయలను ప్రైవేటు సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పెట్టుబడి తీసుకురావాల్సిందే. ఎక్విప్‌మెంట్‌ను కూడా ఫైనాన్స్‌ ద్వారానే కొనుగోలు చేస్తారు. దీంతో రుణాలు, ఫైనాన్స్‌ కిస్తీలు ప్రతి నెలా లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడం బిల్డర్ల మీద ప్రభావం చూపుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సిమెంటు, స్టీల్‌ ధరల పెరుగుదల, వేతనాల చెల్లింపు భారం పడుతుంది. 
► వేతనాల్లో కోత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కొనుగోలుదారులపైనా ప్రభావం చూపడంతో బయ్యర్‌ సెంటిమెంట్‌ దెబ్బతింటుంది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు, గృహ రుణాలపై వడ్డీని8 నుంచి 6 శాతానికి తగ్గించడంతో పాటు ప్రోత్సాహకాలు, ఉపశమన చర్యలు కేంద్రం ప్రకటించాలి. 
► లాక్‌డౌన్‌కు సిద్ధంగా లేకపోవడంతో డెవలపర్లు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నా, ఖర్చులు మాత్రం తగ్గట్లేదు. మంజూరై న రుణాలకు సంబంధించి కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా అదనంగా 20 నుంచి 25% మేర రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో బ్యాంకు రుణాలపై 3 నెలల పాటు మారటోరియం విధించారు. దీన్ని కనీసం ఏడాది పాటు పొడిగించడంతో పాటు, కొంత వడ్డీ కూడా రద్దు చేయాలి. 

► అభివృద్ధి చెందిన దేశాలు వార్షిక ఆదాయంలో సుమారు 16 శాతం మేర సంక్షేమానికి ఖర్చు పెడుతుండగా, మన దేశంలో ఒక్క శాతం కూడా లేదు. కేంద్రం ఇప్పటివరకు రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీని అన్ని రంగాలకు కలిపి ప్రకటించింది. 
► వ్యవసాయం తర్వాత నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సుమారు 250 రకాలైన పరిశ్రమలు నిర్మాణ రంగంపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నందున, ఈ రంగాల ను కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రంగాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం హోదా ఇవ్వాలి. పన్ను ఎగవేతదారులు, నల్లధనం ఉన్న వారిపై చర్యలు తీసుకోండి. కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించండి.
► ప్రస్తుత సంక్షోభాన్ని చూసి డెవలపర్లు, బిల్డర్లు ఆందోళన చెందకుండా మన కుటుంబం, ఉద్యోగులు, కార్మికులను సురక్షితంగా చూసుకుందాం. కొంత నష్టం ఎదురైనా మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటాం. ఐటీ, వాణిజ్యం, టూరిజం తదితర రంగాలు దెబ్బతినడంతో రియల్టీ రంగంపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. 
► ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలు లాభాలు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై కాకుండా మనుగడ సాగించడంపై దృష్టి సారించాలి. కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు భారత్‌ను చైనాకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో స్థిరాస్తి, నిర్మాణ రంగాలకు మంచి భవిష్యత్తు ఉంది.
► భూమి కొనుగోలు మొదలుకుని వినియోగదారుడికి అప్పగించేంత వరకు డెవలపర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే కొనుగోలుదారులు
ముందుకొస్తారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ రంగం పుంజుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement