బంద్ పాటించిన విద్యా సంస్థలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి పట్టణంలోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగాఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరికాంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని శాంతి యుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థి నేతలపై టీఆర్‌ఎస్ నాయకులు దాడులకు పాల్పడి, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు.
ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. బంద్ సందర్భంగా పట్టణంలో పలు విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కార్యక్రమంలో కన్వీనర్ అనిల్‌రెడ్డి, నెహ్రూ పాల్గొన్నారు.
ఖేడ్‌లో కళాశాలల బంద్ విజయవంతం
నారాయణఖేడ్: ఏబీవీపీ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు గురువారం ఖేడ్‌లోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఈసందర్భంగా ఏబీవీపీ నాయకులు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను బంద్ చేయించారు. అనంతరం పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి చేయడం సమంజసం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఏబీవీపీ ఖేడ్ డివిజన్ నాయకులు వడ్ల రమేశ్, ఆకాష్, కృష్ణ, సతీష్ నీలేశ్, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్, ముజ్జు, సూరి, రాజు హెచ్చరించారు.