సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విపత్తులు, ప్రజారోగ్యపరంగా అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులో గరిష్టంగా 50 శాతం వరకు కోత (వాయిదా)కు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతితో మంగళవారం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అత్యవసర ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పెన్షన్లలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటు ఏ చట్టం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటీవల రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక రోజు ముందు అంటే మంగళవారం ఆగమేఘాల మీద తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల ఆర్డినెన్స్–2020 పేరిట ఆర్డినెన్స్ విడుదల చేసింది. 2020 మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని, యావత్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో కొంత భాగాన్ని వాయిదా వేసేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అత్యవసరంగా మారిందని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఈ మేరకు చట్టాన్ని తీసుకురావడం సాధ్యం కాక ఈ అత్యవసర ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
నేపథ్యం ఇదీ..: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత మార్చి 24న రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లు 25 శాతం, నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ గత మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ కోతలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు, పెన్షన్లలో ఈ మేరకు ప్రభుత్వం కోతలను అమలుపరచగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కుదుటపడే వరకు కోతలను కొనసాగించే అవకాశాలున్నాయి.
తిరిగి చెల్లింపుపై 6 నెలల్లో స్పష్టత..
జీతాలు, వేతనాలు, పెన్షన్లలో కోత (వాయిదా) వేసిన భాగాన్ని సదరు వ్యక్తులు, ఉద్యోగులు,పెన్షనర్లకు, సంస్థలకు తిరిగి చెల్లించే విధానంపై స్పష్టతనిస్తూ, కోతలను అమల్లోకి తెచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ప్రకటన జారీ చేస్తారు.
విపత్తు, అత్యయిక పరిస్థితుల్లోనే
ఏదైనా విపత్తు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వ్యక్తికి, సంస్థకు, చెల్లించాల్సిన చెల్లింపులు, బకాయిల్లో కొంత భాగాన్ని గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా లేదా కోత విధించేందుకు చట్టబద్ధంగా ప్రభుత్వానికి అధికారం ఉందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం తెలిపింది. విపత్తులు, అత్యయిక ప్రజారోగ్య పరిస్థితులు నెలకొని ఉన్నంత కాలం వాటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. ఏదైనా చట్టం, ఉత్తర్వులు, నిబంధనలు, నియమావళి, ఏదైనా కోర్టు/ట్రిబ్యునల్ ఉత్తర్వులు, తీర్పులతో సంబంధం లేకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర ఏదైనా వ్యక్తులకు నెలవారీగా చెల్లించాల్సిన చెల్లింపుల్లో గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఉద్యోగి, పెన్షనర్, ఇతర ఎవరైనా వ్యక్తి, ఏదైనా ప్రభుత్వ యాజ మాన్య/ నియంత్రిత/ ఎయిడెడ్ సంస్థ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలు, చట్టబద్ధ సంస్థ, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఎయిడెడ్ విద్యా సంస్థలు తదితర సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment