సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం సర్కారు వేట సాగిస్తోంది. కాళేశ్వరం నిధుల సేకరణ కోసం ఇప్పటికే భారీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 33 వేల కోట్ల రుణం పొందిన ప్రభుత్వం.. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రూ. 17 వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆంధ్రాబ్యాంకు సహా ఇతర బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డిలోని ఎలక్ట్రో మెకానికల్ పనులకూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు తీసుకోవాలని అనుకుంటోంది.
భారీ నిధులు.. భారీ రుణాలు
కృష్ణా, గోదావరి నదుల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 1,94,403 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వగా.. రూ. 1,40,449 కోట్ల పనులకు ఒప్పందాలు కుదిరి పనులు మొదలయ్యాయి. ఇందులో రూ. 83,658 కోట్ల మేర ఇప్పటికే ఖర్చు చేశారు. మరో రూ. 1.11 లక్షల కోట్లు అవసరం కానున్నాయి. అయితే సీతారామ, డిండి, పాలమూరు–రంగారెడ్డి రీ ఇంజనీరింగ్‌తో వ్యయం అంచనా మరో రూ. 34 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. దీంతో నిధుల సమీకరణకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. వాటితో రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అవసరమైన మేర రుణాలు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది.
ఆ నాలుగింటికి ఆంధ్రాబ్యాంకు రెడీ
కాళేశ్వరం కోసం ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర, విజయ, పీఎన్‌బీ, పీఎఫ్‌సీల ద్వారా రూ. 33 వేల కోట్ల రుణాన్ని సర్కారు పొందింది. ఇందులో ఇప్పటికే రూ. 16 వేల కోట్ల మేర ఖర్చయ్యాయి. తాజాగా మరో 4 ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవాదుల అంచనా రూ. 9,423 కోట్ల నుంచి రూ. 13,445 కోట్లు, సీతారామ అంచనా రూ. 7,926 కోట్ల నుంచి రూ. 14,500 కోట్లకు పెరగడం.. తుపాకులగూడెం ప్రాజెక్టుకు రూ. 1,919 కోట్లు, వరద కాల్వ పనులను మరో రూ. 4,500 కోట్లు అవసరమవడంతో 4 ప్రాజెక్టులతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ. 17 వేల కోట్లు రుణాలు తీసుకోవాలని భావిస్తోంది. రుణాలు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం ముందుకు రావడంతో రెండ్రోజుల కిందట సీఎస్ ఎస్‌కే జోషి వారితో చర్చలు జరిపారు. రుణాలపై ఆగస్టు 15లోపు స్పష్టత ఇస్తామని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది.
పాలమూరుకు పీఎఫ్‌సీ..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు రుణాలు తీసుకోవాలని సర్కా రు నిర్ణయించింది. ఈ పనులకు రూ. 17 వేల కోట్లు అవసరం ఉండగా అంతమొత్తం రుణాలిచ్చేందుకు పీఎఫ్‌సీ ముందుకొచ్చింది. అయితే ఎప్పుడెప్పుడు ఎంత రుణం ఇవ్వాలి, దానిపై వడ్డీ తదితరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు రుణాలపై పీఎఫ్‌సీ చైర్మన్ రాజీవ్ శర్మ ఇటీవలే ప్రభుత్వంతో చర్చలు జరిపి నెలలో రుణాల ప్రక్రియ మొదలు పెడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ రుణాలు ఓకే అయితే మొత్తంగా ప్రాజెక్టుల కోసం రూ. 67 వేల కోట్ల మేర రుణం తీసుకున్నట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment