జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న బాధితులు
కలుషిత నీరే కారణమంటున్న వైద్యులు
తాండూరు రూరల్ : మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెతో కొన్నిరోజులుగా వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అతిసారం ప్రబలగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో రోగులు చేరుతున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం పట్ల ప్రజాప్రతిని ధులు, అధికారులు, వైద్యసిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోజురోజుకూ గ్రామీణ ప్రజలు అతిసారంతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే దీని బారిన పడుతున్నారని ఇక్కడి వైద్యులు నిర్ధారిస్తున్నారు.
గ్రామాల్లో తాగునీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే ఈ సమస్య పెరుగుతోంది. దీనికితోడు పైప్‌లైన్లు లీకేజీలు లేకుం డా, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. తాండూరు డివిజన్‌లోని చాలా గ్రామాల్లో తాగునీటి కుళాయిల వద్ద మురుగు చేరి, చేతిపంపుల వద్ద అపరిశుభ్రంగా మారింది.
ఈనెల 1 నుంచి 13వ తేదీ వరకు 367 మంది అతిసారం రోగులు జిల్లా ఆస్పత్రిలో చేరారు. 1న 26 మంది, 2న-30 మంది, 3న 25 మంది, 4న 26 మంది, 5న 30 మంది, 6న 26 మంది, 7న 27 మంది, 8న 20 మంది, 9న 31 మంది, 10న 30 మంది, 11న 31మంది, 12న 33 మంది, 13న 32 మంది ఈ ఆస్పత్రికి వచ్చారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో రోగులకు కనీస వసతులు లేవు. సరైన మంచాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులు పడుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొంది.
మొరపెట్టుకున్నా స్పందనలేదు
గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని పలుమార్లు ‘ప్రజాదర్బారు’లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో చాలా వరకు అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి కుళాయిల వద్ద మురుగు, అపరిశుభ్ర వాతావరణంతోనే ఈ సమస్య పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- వెంకటేషం, గౌతాపూర్
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దు. ఎక్కువగా ఫిల్టర్ నీటిని లేదా మరగబెట్టిన నీటిని తాగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తాగునీటి కుళాయిల వద్ద పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి.
- జయప్రసాద్, వైద్యుడు, తాండూరు జిల్లా ఆస్పత్రి
వామ్మో.. అతిసారం
Published Thu, Aug 13 2015 11:50 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement