
ఇక స్మార్ట్‌గా బస్ టికెట్
- స్మార్ట్‌ఫోన్ ద్వారా బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
- ప్రారంభించిన ఎండీ పూర్ణచందర్‌రావు
- రిజర్వేషన్ కేంద్రాలపై తగ్గనున్న ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఆర్టీసీ ప్రయాణం మరింత సులభతరమైంది. జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు అవసరం లేదు. 30 రోజు ల అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలుకొని, అప్పటికప్పుడు బయలుదేరే బస్సులకూ రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్‌లోకి తెచ్చే పథకాన్ని ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు సోమవారం బస్‌భవన్‌లో ప్రారంభించారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులందరికీ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ టీఎస్‌ఆర్‌టీసీ బస్ డాట్ ఇన్’’ ద్వారా, ఏపీ ప్రయాణికులు ‘‘డ బ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్ డాట్ ఇన్’’ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం తో రిజర్వేషన్, ఏటీబీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశముంటుందని అంచనా. ప్రయా ణానికి గంట ముందు కూడా బుక్ చేసుకోవచ్చు.
ప్రతి రోజూ లక్షా 41 వేల టికెట్లు
ఆర్టీసీలో ప్రతి రోజూ లక్షా 41 వేల సీట్లు అడ్వాన్స్, కరెంట్ బుకింగ్‌ల ద్వారా నమోదవుతున్నాయి. వీటిలో 45 వేల టికెట్‌లు ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్‌ఎస్) ద్వారా భర్తీ అవుతున్నాయి. వీటిలో 13,743 టికెట్లు ఆర్టీసీ బస్‌స్టేషన్‌లలోని రిజర్వేషన్ కేంద్రాల ద్వారా, 16,578 టికెట్‌లు ఏటీబీ ఏజెంట్‌ల ద్వారా బుక్ అవుతుండగా, ఇంటర్నెట్ ఈ-బుకింగ్ ద్వారా 13,235, ఇతర ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్ ద్వారా 1,444 బుక్ అవుతున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లో సైతం అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సులు నడిచే అన్ని ప్రాంతాలకు ఈ స్మార్ట్‌ఫోన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.