
పత్తి ‘పక్క’దారి..
- ఏఎంఎఫ్, వ్యాట్ ఎగవేస్తూ ఏపీ, మహారాష్ట్రలకు ఎగుమతి
- రైతుల ముసుగులో ట్రేడర్ల నిర్వాకం
- గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- సరిహద్దు జిల్లాల చెక్‌పోస్టులపై నిఘా పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండిన పత్తి అక్రమ మార్గాల్లో పక్క రాష్ట్రాలకు మళ్లుతోంది. ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన కోట్ల రూపాయల పన్నులను ఎగవేస్తూ వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా సరిహద్దుల నుంచే ప్రతి రోజూ సుమారు 40 నుంచి 50 లారీల పత్తిని ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి పన్నులు కట్టకుండా తరలిస్తున్నారని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది.
దీనిద్వారా ఈ పదిహేను రోజుల్లోనే సుమారు రూ.2.40 కోట్ల పన్నును వ్యాపారులు ఎగవేశారని అధికారులు తేల్చారు. దీంతోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇలాంటిదందానే ప్రతినిత్యం జరుగుతోందని తన తనిఖీల్లో తేల్చింది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు కోట్లల్లో గండిపడుతున్న దృష్ట్యా రంగంలోకి దిగిన విజిలెన్స్ సరిహద్దు చెక్‌పోస్టులపై నిఘాను మరింత పెంచింది.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పత్తి అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన సుమారు 80 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టిన ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.4,050గా నిర్ధారించింది. అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికీ పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, నాణ్యతను సాకుగా చూపి ధరను తగ్గించి చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో లాభసాటి ధర కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్తు చూపుతున్నారు.
ఇదే అదునుగా భావించిన పక్క రాష్ట్ర వ్యాపారులు మన రాష్ట్ర రైతుల వద్ద కొనుగోళ్లకు బారులు తీరుతున్నారు. బయటి రాష్ట్రాల వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తే దాన్ని తరలించేందుకు అగ్రికల్చర్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) 1శాతం, వ్యాట్ 5శాతం రాష్ట్రానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ తన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటున్న రైతు ముసుగులో వ్యాపారులే పత్తిని పక్క రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. దీంతోపాటే చట్టపరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరికొంత మంది వ్యాపారులు ఏపీ ఇస్తున్న వే బిల్లులతో ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళుతూ పన్నులు మాత్రం కట్టడం లేదు. పన్నులేవీ చెల్లించకుండా నల్లగొండ జిల్లా కోదాడ, నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లకు పెద్దఎత్తున పత్తిని తరలిస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించింది.
ఇలా ఒక్క నల్లగొండ జిల్లా నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలివెళుతున్నాయని, దీని ద్వారా ఒక్కో లారీపై రావాల్సిన పన్ను సుమారు రూ.40 వేలు ప్రభుత్వం నష్టపోతోందని అధికారులు లెక్కలుకట్టారు. గడిచిన పది, పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ తంతు ద్వారా ఇప్పటికే వ్యాపారులు రోజుకు రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ. 2.40 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి మహారాష్ట్రకి, నిజామాబాద్ జిల్లా మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు, మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు ఈ రీతిలోనే వ్యాపారులు పత్తిని తరలించుకుపోతున్నారని ఈ నష్టం కోట్లలోనే ఉందని విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత నిఘాను పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని ఏడు యూనిట్లను విజిలెన్స్ శాఖ అప్రమత్తం చేసింది. సరిహద్దు చెక్‌పోస్టులపై నిఘాను పెంచాలని ఆదేశించింది.
అధికారులను అప్రమత్తం చేశాం
ఈ విషయం మా దృష్టికి వచ్చింది. విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశాం. దీనిపై వాస్తవ నివేదికను ఇవ్వాలని, సమస్య పరిష్కార సూచనలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించాం. ఈ నివేదికలు రాగానే దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం.
- టి.వివేక్, ఓఎస్‌డీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్