ఆదిలాబాద్ : జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్‌ఆర్వోలు) ఉన్నాయి. ఖానాపూర్, లక్సెట్టిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 2007లో ఏర్పడగా, మిగతావి 1975-1980 మధ్య కాలం నుంచి ఉన్నాయి. ఏటా రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ప్రభుత్వానికి రూ.70 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. మంచిర్యాల కార్యాలయానికి మాత్రమే సొంత భవనం ఉండగా, మిగతావి ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
లక్సెట్టిపేట కార్యాలయం ప్రభుత్వ విశ్రాంతి గృహంలో కొనసాగుతుండగా, తాజాగా ఆ భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో అక్కడ కూడా అద్దె భవనం కోసం వెతుకుతున్నారు. తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పడంపై ఉద్యోగులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇరుకు భవంతులు
ఆదిలాబాద్ బస్టాండ్ రోడ్డుకు సమీపంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. దీనికి రూ. నెలకు రూ.16,700 అద్దె చెల్లిస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉద్యోగులు కూర్చోవడానికే సరిగ్గా గదులు లేవు. ఉద్యోగులతోపాటు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లి రావాల్సిందే. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నిర్మాణం కోసం 2012లో రూ.75 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ కార్యాలయానికి సంబంధించిన స్థల వివాదం కారణంగా కాంట్రాక్టరు నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో నిధులు గతేడాది వెనక్కి మళ్లాయి.
బోథ్ కార్యాలయానికి రూ.63 లక్షలు మంజూరు కాగా, అక్కడ గ్రామ పంచాయతీ స్థలం గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. అయితే భవన నిర్మాణం చేపట్టకపోవడంతో డబ్బులు వెనక్కి వెళ్లాయి. ప్రతి నెల రూ.3,250 అద్దె చెల్లిస్తున్నారు.
భైంసాలో రూ.5,500, నిర్మల్ రూ.4 వేలు, ఆసిఫాబాద్‌లో రూ.9వేలు, ఖానాపూర్ రూ.2,200 అద్దె చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వానికి అత్యధిక ఆ దాయం ఇచ్చే శాఖల్లో ఒకటైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం చోద్యం.
సొంత భవనాల్లేవ్!
Published Sun, Aug 10 2014 2:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement