నిధుల పరవళ్లు
బడ్జెట్‌లో ఈసారీ అగ్రతాంబూలమే..
►రూ.25 వేల కోట్ల కేటాయింపు
►కాళేశ్వరానికి గరిష్టంగారూ.6,681 కోట్లు
►పాలమూరు ఎత్తిపోతలకు రూ.4,000కోట్లు
►మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు రూ.1,720 కోట్లు
హైదరాబాద్ బడ్జెట్‌లో గతేడాది మాదిరే ఈసారీ సాగునీటి ప్రాజెక్టులకు అగ్రతాంబూలం దక్కింది. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.23,675.73 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 1,324.27 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆయకట్టుకు నీరందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులిచ్చారు. దీర్ఘకాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులకూ çభారీగానే కేటాయించారు. మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు), కోయిల్‌సాగర్(3.90 టీఎంసీ) ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నందున ఈ నాలుగు ప్రాజెక్టులకే బడ్జెట్‌లో రూ.1,633.36 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జూలై నాటికి వీటిని పూర్తిచేసి జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు ఈ కేటా యింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,681 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.4 వేల కోట్లు కేటాయించారు. దేవాదుల, డిండి, సీతారామ ఎత్తిపోతల, కంతనపల్లి, దిగువ పెన్‌గంగ వంటి ప్రాజెక్టులకు కేటాయింపులు భారీగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుద్దవాగు, స్వర్ణ, గొల్లవాగు, నీల్వాయి తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించారు.
నిధులు సరే.. ఖర్చు ఏది?
సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు అంతంతే ఉంటోంది. గత ఏడాది సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది రూ.14,918.19 కోట్లే! ఇందులోనూ ఇప్పటివరకు రూ.11,500 కోట్ల మేర బిల్లులు చెల్లింపు కాగా.. మరో రూ.3 వేల కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో కొలిక్కి రాని భూసేకరణ, సహాయ పునరావాసం, కోర్టు కేసుల కారణంగా ప్రాజెక్టు పరిధిలో అనుకున్న మేర పనులు జరగలేదు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.7,860 కోట్లు కేటాయించినా.. చివరికి దాన్ని రూ.2,851.88 కోట్లకు సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం రూ.6,280 కోట్లు కేటాయించినా.. రూ.2,280 కోట్లకే పరిమితం చేశారు. దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే జరిగింది. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో కేటాయింపులు జరిగినా.. ఏమాత్రం ఖర్చు చేస్తారన్నది వేచి చూడాల్సిందే!
సింహభాగం కాళేశ్వరానికే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది ప్రాజెక్టుకు రూ.6,681.87 కోట్లు కేటాయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో వేగం పెరగడం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్, రంగనాయక్‌సాగర్ వంటి రిజర్వాయర్లకు రూ.12 వేల కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది పనులు వేగం పుంజుకుంటాయని సాగునీటి శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి కేటాయింపులను భారీగా పెంచారు.
చిన్ననీటికి యథాతథం మైనర్ ఇరిగేషన్‌కు రూ.2,000 కోట్లు
హైదరాబాద్: బడ్జెట్‌లో చిన్న నీటి పారుదలకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది సుమారు రూ.250 కోట్ల మేర ఎక్కువ. ఇందులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయకు రూ.1,283 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 7 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇందులో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) నుంచి సుమారు రూ.242.78 కోట్లు, సాగునీటి స్తవర ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద మరో రూ.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది.
ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద తొలి విడతో 9 వేలు, రెండో విడతలో 8 వేల చెరువుల పునరుద్ధరణను చిన్న నీటి పారుదల శాఖ పూర్తి చేసింది. మైనర్ ఇరిగేషన్‌కు 2016– 17లో బడ్జెట్‌లో రూ.2,253 కోట్లు కేటాయిం చింది. అయితే ఈ బడ్జెట్‌ను రూ.1,745.09 కోట్లకు సవరించారు. కాగా ఈ ఏడాది మాత్రం పెండింగ్‌లో ఉన్న చెరువుల పనులను పూర్తి చేయడం, వరదల ధాటికి దెబ్బతిన్న వాటికి మరమ్మతులు, మినీ ట్యాంక్‌బండ్ కింద చేపట్టిన చెరువుల పనులను పూర్తి చేయడం లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు.
వివిధ ప్రాజెక్టులకు గతేడాది, ఈసారి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)