ఐఆరా.. పీఆర్సీనా? | TRS Government Review On PRC And IR | Sakshi
Sakshi News home page

ఐఆరా.. పీఆర్సీనా?

Published Tue, Jul 9 2019 1:42 AM | Last Updated on Tue, Jul 9 2019 12:14 PM

TRS Government Review On PRC And IR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న ఐఆర్, పీఆర్సీ అంశాలపై మళ్లీ చర్చ జోరందుకుంది. పీఆర్సీ అమలు, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలపై త్వరలోనే చర్చిస్తామంటూ సీఎం నోటివెంట వచ్చిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణం. పీఆర్సీపై సమావేశం ఎప్పుడు? ముందుగా మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తారా? లేక పీఆర్సీనే అమలు చేస్తారా? అనే చర్చ జోరందుకుంది. సీఎంతో సమావేశం ఎప్పుడు ఉంటుందంటూ సంఘాల నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా తేల్చకపోతే ఆందోళన చేస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు ఓ అడుగు ముందుకేశాయి. దీంతో.. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, పింఛనర్లకు ఐఆర్‌/ఫిట్‌మెంట్‌ ఎంత ఇస్తే ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కలు తేల్చింది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు ఓ పరిష్కారం చూపాలన్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. 
 
ఒక్క శాతం ఇస్తే రూ.225 కోట్లు 
ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పింఛనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీ లేదా ఐఆర్‌ను అమలు చేయాల్సి ఉంది. వారికి ఒక్క శాతం ఐఆర్‌ ఇచ్చినా లేదా ఫిట్‌మెంట్‌ అమలు చేసినా ఖజానాపై రూ.225 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. ఇలా ఒక్క శాతం నుంచి మొదలుకొని 35% వరకు ఫిట్‌మెంట్‌ లేదా ఐఆర్‌ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27% ఐఆర్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసంగా 27% ఐఆర్‌ ఇస్తారన్న ఆలోచనలతో ఉద్యోగులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐఆర్‌ కింద ఏటా రూ.6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు 35% అమలు చేస్తే ప్రభుత్వం రూ.7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చింది. 
 
ఎలాగైతే ఉద్యోగులకు సంతృప్తి? 
ఉద్యోగులకు సంబంధించిన అంశాల పరిష్కారం దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగితే మెజారిటీ వర్గానికి సంతృప్తి కలిగించగలమన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటలిజెన్స్‌ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర ఖజానాపై పడే భారంపై అంచనా వేసుకొని చివరగా ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. పీఆర్‌సీ వర్గాలతోపాటు ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. అనధికారిక సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
27% ఐఆర్‌? 30% ఫిట్‌మెంట్‌? 
ఉద్యోగుల సమస్యల్లో ప్రధానమైన డిమాండ్‌ ఐఆర్‌ ఇవ్వడం, పీఆర్‌సీ అమలు. రెండింటిలో ఏ ఒక్కదానిపై నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతానికి చాలు. అయితే ప్రభుత్వం రెండింటిపైనా ఆలోచనలు చేస్తోంది. ఐఆర్‌ ఇస్తే ఎంతివ్వాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. ఏపీలో 27% ఇచ్చినందున.. అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగులు అంగీకరిస్తారా? అన్న అలోచనలు చేస్తోంది. ఒకవేళ ఉద్యోగుల ఒప్పుకోకపోతే సంప్రదింపుల సమయంలో 27 శాతానికి ఓకే చేద్దామా? అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇపుడు ఐఆర్‌ ఇచ్చినా, మరో మూడు నాలుగు నెలల తరువాత మళ్లీ పీఆర్‌సీ అమలు చేయక తప్పదు. అప్పడే అదే 27% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేస్తామంటే.. మళ్లీ ఉద్యోగులు అలకవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే 30% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీనే అమలు చేస్తే మరో ఐదేళ్ల వరకు తంటాలుండవన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. గతంలో 43% ఫిట్‌మెంట్‌ ఇవ్వడం, అప్పుడు ఇచ్చిన స్కేల్స్‌ కంటే తరువాత కొన్ని కేటగిరీల్లో స్కేళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 30%తో ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేస్తే ఉద్యోగులు సంతృప్తి చెందుతారన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఇపుడు 27% ఐఆర్‌ ఇచ్చి మరో నాలుగైదు నెలల తరువాత 3% కలిపి 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీనే తరువాత అమలు చేయాలా? అన్న చర్చ కూడా జరుగుతోంది. 
 
తెరపైకి ప్యాకేజీ 
ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీతోపాటు ప్రధాన డిమాండ్లు అయిన ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సును 61 ఏళ్లకు పెంచడం, కాంట్రిబ్యూటరీ పింఛను స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు చేయడం వంటి వాటితోపాటు ఇతర సమస్యలను పరిష్కరించేలా ప్యాకేజీ అమలు చేయాలా? అనే కోణంలో చర్చిస్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఐఆర్‌ను 25% ఇస్తూ ఈ ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపితే, ఐఆర్‌ కొంత తగ్గినా ఉద్యోగులు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దానిపైనా ప్రభుత్వం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. 
 
మరో నాలుగైదు నెలలకైనా చేయాల్సినవే కదా! 
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎక్కువగా పట్టుండే పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ఒక్క ఓటును కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే ఎన్నికల్లో సులభంగా నెగ్గొచ్చనే వాదన ఉంది. పైగా వారి సమస్యలను ఇప్పుడు కాకపోతే మరో నాలుగైదు నెలలకైనా పరిష్కరించాల్సిందే.. అదేదో ఇప్పుడు చేస్తే సరిపోతుంది కదా! అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఉద్యోగుల సమçస్యలపై ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకుంటే వారిలో ఆందోళనను పోగొట్టడంతోపాటు, వారిని దగ్గర చేసుకోవచ్చన్న వాదనను ఉన్నతాధికారులే వ్యక్తం చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement