
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ వేతనం కొందరికి గత నెలలో మిగతా వారికి గురువారం అందగా, అక్టోబర్ వేతనం శుక్రవారం విడుదలైంది. ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 5న ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. దాదాపు 1,200 మంది సమ్మెలో పాల్గొనకుండా సంస్థలోనే పని చేస్తున్నారు. అయినా వీరందరికి కూడా రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో పడిపోయాయి. సమ్మెతో సంస్థకు టికెట్ రూపంలో వచ్చే ఆదాయం పడిపోవటంతో వేతనాల చెల్లింపు నకు డబ్బులు లేకుండా పోయాయి. దీంతో అందుబాటులో ఉన్న సొంత ఆదాయం నుంచే వేతనాలు చెల్లించగలిగారు.
అందని వేతనాలు...
ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోపు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో 495 మంది విధుల్లో చేరుతున్నట్లు లేఖలు సమర్పించారు. వీరిలో 240 మంది మాత్రమే విధుల్లోకి వస్తున్నారు. ఈ 240 మందికి సెప్టెంబర్ వేతనాలు అందాల్సి ఉన్నా.. విడుదల కాలేదు. దీంతో వీరిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారు వేతనాల కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే తమకు సెప్టెంబర్ నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. దీంతో విషయం రవాణా మంత్రి దృష్టికి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment