
ఈ దశలో జోక్యం చేసుకోలేం!
‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేయమంటూ విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు హస్తినలో నిరాశే ఎదురైంది.
* ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు కేంద్రం స్పష్టీకరణ
* ఇప్పటికే ఐబీ ద్వారా పూర్తి సమాచారం సేకరించిన కేంద్రం
* ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు ససేమిరా
* సెక్షన్ 8కు సంబంధించి కూడా బాబుకు దక్కని భరోసా
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేయమంటూ విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు హస్తినలో నిరాశే ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిందిగా మొరపెట్టుకోగా.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ చేస్తున్న దర్యాప్తులో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని, కేవలం ట్యాపింగ్ జరిగిందని చెబుతున్న అంశంపై మాత్రమే దృష్టి పెడతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) స్పష్టం చేసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ఏసీబీ ద్వారా తనకు నోటీసులు జారీ చేయకుండా, తనను నిందితుల జాబితాలో చేర్చకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రులను కోరారు. అయితే అప్పటికే కేంద్ర నిఘా సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ద్వారా ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరించిన కేంద్రం.. ఇందుకు ససేమిరా అంది. ప్రాథమిక సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాల ద్వారా ముందుకెళ్తూ చట్ట పరిధిలో సంబంధిత న్యాయస్థానానికి సమాచారం ఇస్తూ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 8కు సంబంధించి బాబు లేవనెత్తిన అంశంపై కూడా.. ఇప్పటివరకు ఆ కోణంలో సమస్యలు వచ్చినట్లుగా తమకు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది.
ఏసీబీ పని తీరు శాంతిభద్రతల అంశం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి ఎలాంటి అభ్యం తరాలున్నా, ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలు సమీకరించినా సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, ఇతర హక్కులు, అధికారాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనా, వాటిని తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నట్లు ఆధారాలు లభించినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుని గవర్నర్ ద్వారా ఆ ప్రభుత్వాన్ని కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పినట్లు తెలిసింది.
ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సంబంధించిన 120 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న విషయంపై ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ అంశాన్ని పరిశీలిస్తామని, ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చడానికి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని హోంశాఖ హామీ ఇచ్చింది. ఒకటి రెండురోజుల్లో టెలికం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా సాంకేతిక నిపుణులు, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపాలని నిర్ణయించింది. ఈ బృందం నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్‌ఏ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.