- అప్రమత్తమైన డ్రైవర్.. తప్పిన ప్రమాదం
- పలు రైళ్ల రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు
నవాబుపేట: సాంకేతిక లోపంతో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం శంకర్‌పల్లి మండలం గొల్లగూడ- రావులపల్లి స్టేషన్ల మధ్య సుమారు మూడు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు.. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌కు వెళుతుంది. గొల్లగూడ, రావులపల్లి స్టేషన్ల మధ్యకు రాగానే సాంకేతిక లోపం సంభవించినట్లు డ్రైవర్ గమనించాడు.
వెంటనే అప్రమత్తమై రైలును అదుపు చేసి నిలిపివేశాడు. గొల్లగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ కె. నాగరాజుకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం మొదటి ఇంజిన్ మరమ్మతులకు గురైనట్లు తెలుసుకున్నాడు. రెండో ఇంజిన్ సహాయంతో ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి గొల్లగూడ స్టేషన్ వరకు మెల్లగా వెనక్కి తీసుకెళ్లి స్టేషన్ వద్ద ఉంచాడు. విషయాన్ని స్టేషన్ మాస్టర్, సికింద్రాబాద్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి సంఘటన స్థలానికి చేరుకుని సాంకేతిక లోపానికి గురైన మొదటి ఇంజిన్‌ను తొలగించారు. రైలుకు ఉన్న రెండో ఇంజిన్ కూడా సక్రమంగా లేకపోవడంతో వారు తీసుకువచ్చిన మరో ఇంజిన్‌ను జత చేసి రైలును మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సికింద్రాబాద్‌కు తరలించారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సుమారుగా మూడు గంటలు నిలిచి పోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రైవర్ సాంకేతిక లోపాన్ని గమనించి రైలును ఆపక పోయి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని రైల్వే సిబ్బంది తెలిపారు.
రైళ్ల నిలిపివేతతో ప్రయాణికుల ఇబ్బందులు..
వికారాబాద్ రూరల్ : శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌లో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు వచ్చే పల్నాడు, తాండూరు ప్యాసింజర్లు రద్దయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. వికారాబాద్ నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు వందలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రద్దు కావడం, ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నిత్యం వందలాది ప్రయాణికులు శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్- వికారాబాద్ వైపు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మంగళవారం ఉదయం రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గొల్లగూడ-రావులపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్య నిలిచిపోయింది. అసలే ఆర్టీసీ సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మరింత ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను మరమ్మతులు చేయడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు 3 గంటల పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్ స్టేషన్‌లలో నిలిపివేశారు. వికారాబాద్- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలును పూర్తిగా రద్దు చేశారు.
సాంకేతిక లోపంతో నిలిచిన ‘రాజ్‌కోట్’
Published Wed, May 13 2015 12:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement