నవ్వుతూ బతికేద్దాం..!
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
హైదరాబాద్: నవ్వు ఒక యోగం... నవ్వడం ఒక భోగం...అన్నారు. పెద్దలు ప్రస్తుతం నగరవాసులు ఇదే నానుడిని అనుసరిస్తున్నారు. దీంతో పగలబడి నవ్వుతూ ఎక్సర్‌సైజులు చేసేవారు ప్రతిరోజు ఉదయం నగరంలోని పలు పార్కుల్లో మనకు తారసపడుతున్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు. దీంతో లాఫర్ యోగాపై నగరంలో నానాటికి క్రేజీ పెరిగిపోతోంది. లాఫర్ యోగా కథాకమామిషు ఏమిటో చూద్దాం...
ఆరోగ్యం..ఆనందం..ఆహ్లాదం
సరదాగా సాగే లాఫర్ యోగాలో వినోదంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బీపీ, షుగర్ నియంత్రించేందుకు ఫ్యాన్ ఎక్సర్‌సైజ్...మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మోకాలి ఎక్సర్‌సైజు...నడుంను ఇష్టానుసారంగా తిప్పుతూ చేసే పొట్ట ఎక్సర్‌సైజును.. నవ్వుతూ చకచక చేసేందుకు సిటీవాసులు ఆసక్తి చూపుతున్నారు. నాలుకను ముందుకు చాచి సింహంలాగా దూకుతూ ‘ఆఆఆఆ...’అని అరుస్తూ చేసే సింహగర్జన ఇందులో ప్రత్యేకం.
ఇలా చేయడాన్ని థైరాయిడ్ ఎక్సర్‌సైజు అంటారు. కుడి చెయ్యి బొటనవేలును అటుఇటు తిప్పుతూ కళ్లు కరెక్ట్‌గా దాన్ని ఫాలో అవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుందని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. చివర్లో ఓంకారం చేసి...కళ్ల మూసుకొని బిగ్గర నవ్వుతూ. ‘ఊఊఊఊ...’ అని అరవడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుందని వారు తెలిపారు.
ఇలా మొదలైంది
నగరవాసులు లాఫర్ యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. అల్వేస్ బీ చీర్‌ఫుల్(ఏబీసీ) లాఫర్ క్లబ్ వ్యవస్థాపకుడు సీహెచ్ వెంకటాచారి. ఎనిమిదేళ్ల క్రితం సఫిల్‌గూడలో ప్రారంభమైన లాఫర్ క్లబ్ ప్రస్థానం నేతాజీనగర్, మణికొండ, పోచంపల్లి, ఖమ్మం, నాగార్జున సాగర్‌లకు విస్తరించిందన్నారు. తాను ముంబైతో పాటు వివిధ నగరాల్లో జరిగిన లాఫర్ యోగా తరగతులకు హాజరై ట్రైనర్‌గా మారానని, ఇప్పుడు నగరంలోని ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు యోగా ట్రైనర్ రమణచారి.