పదే పదే బంగారు తెలంగాణ కోసం మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బంగారు తెలంగాణ తీవ్రవాదులకు, దోపిడీ దొంగలకు, అరాచక శక్తులకు స్థావరం కాకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ సూచించారు.
ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సూచన
సాక్షి, హైదరాబాద్: పదే పదే బంగారు తెలంగాణ కోసం మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బంగారు తెలంగాణ తీవ్రవాదులకు, దోపిడీ దొంగలకు, అరాచక శక్తులకు స్థావరం కాకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ సూచించారు. ఆదివారం ఆయన లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పేరుతో ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు చేసేకన్నా.. ప్రజల మాన, ప్రాణాలను అనుక్షణం కాపాడే హోంశాఖకు అధిక నిధులు కేటాయించి పోలీసు శాఖను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయపడ్డ పోలీసులకు అవసరమైతే బయటి నుంచి వైద్యనిపుణులను రప్పించి ప్రాణాలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్‌కు అధునాతన ఆయుధాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సమకూర్చాలన్నారు. తెలంగాణ సత్తా, పౌరుషాన్ని చాటిన పోలీసులు వెంకటేశ్వర్లు, మధు, రమేశ్‌లకు తక్షణమే అవార్డులు ప్రకటించి, ప్రమోషన్‌ను ఇవ్వాలని సూచించారు.