నేడు జెడ్పీ భేటీ
- ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
- వెంటాడుతున్న అకాల వర్షాలు
- తీర్మానాలు చేసినా కానరాని కరువు ప్రకటన
- పల్లెల్లో తాగునీటి కోసం ప్రజల పాట్లు
- మిషన్ కాకతీయ పనులపై అసంతృప్తి
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా జరగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, తాగునీటి అంశాలపై గళమిప్పేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేశాయి. ప్రతి సమావేశంలోనూ ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించకుండానే ముగిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన సోమవారం జరిగే ఈ సమావేశంలోనైనా సమస్యలు, అంశాలు పూర్తిగా చర్చకు వస్తాయా అన్న సంశయం వ్యక్తమవుతోంది. జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతులు రబీలోనైనా గట్టెక్కవచ్చని ఆశించారు. అయితే అకాలవర్షాలు రైతులపాలిట శాపంగా మారాయి.
గత నెల, ఈ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల సుమారు రెండువేల హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం, మక్కలు తడిసి తీవ్ర నష్టం మిగిల్చాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల్లోని రైతులు అకాల వర్షాల కారణంగా పంటనష్టం చవిచూడాల్సి వచ్చింది. మామిడి, కూరగాయల పంటలు 7వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పరిహారం అందజే సి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులను ఆదుకునేందుకు వీలుగా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని జెడ్పీ సమావేశంలో పలుమార్లు తీర్మానం చేసినా ఇప్పటికీ ప్రకటన వెలువడలేదు. రైతుల ఆశల్ని ప్రజాప్రతినిధులు ఏమేరకు తీరుస్తారో చూడాల్సి ఉంది.
పల్లెల్లో తాగునీటి ఇక్కట్లు
జిల్లాలోని సుమారు 500 జనావాసాల్లో తాగునీటి సమస్య ఉంది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో గ్రామాలతో పాటు గిరిజన తండాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. 276 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించటంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులపైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయంలేదని, పూడికతీత పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. జెడ్పీ సమావేశంలో మిషన్ కాకయతీయ పనులను విపక్ష సభ్యులు ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది. జెడ్పీ సభ్యులు పెన్షన్‌లు, రేషన్‌కార్డులు, అభివృద్ది నిధుల కేటాయింపు, జెడ్పీ ద్వారా చేపడుతున్న పనులపై చర్చించే అవకాశం ఉంది. జెడ్పీ అధికారులు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.
కొత్తహంగులు
జిల్లా పరిషత్ సమావేశ మందిరం కొత్తహంగులతో ముస్తాబైంది. జెడ్పీ సమావేశ మందిరంలో ఫర్నిచర్, లైటింగ్ ఇతర సదుపాయాలు సరిగ్గా లేకపోవటంతో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ సమావేశ మందిరానికి మరమ్మతులు చేయించారు. కొత్తఫర్నిచర్, నూతన లైటింగ్‌తో జెడ్పీ హాల్ కొత్త సొబగులతో సోమవారం నాటికి సిద్ధమైంది.
సమస్యలు చర్చకు వచ్చేనా?
Published Mon, May 18 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement