
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్‌వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్ సెక్టర్‌లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఇంకోవైపు కశ్మీర్ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు.