అమ్మాయిలపై వేధింపులు: ముగ్గురి హత్య
బిజ్నూర్ : ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో మరో మతకల్లోలం చెలరేగింది. బిజ్నూర్ పట్టణంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థినులను ఓ వర్గానికి చెందిన యువకులు వేధించడంతో మొదలైన గొడవ చివరికి ముగ్గురి హత్యకు దారితీసింది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ దల్టీత్ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
బిజ్నూర్ లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శుక్రవారం స్కూల్ కు వెళుతున్న సమయంలో మరో వర్గానికి చెందిన యువకుల బృందం వేధింపులకు పాల్పడింది. స్కూల్ కు వెళ్లాల్సిన ఆ అమ్మాయిలు ఏడ్చుకుంటూ ఇళ్లకు వెళ్లి.. వేధింపుల విషయాన్ని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు.. యువకులను నిలదీసేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నాయి. ఒక దశలో యువకుల తరఫు బంధువుల్లో ఒకరు తుపాకి బయటికితీసి.. యువతి తరఫున మాట్లాడుతోన్న వారిపై కాల్పులు జరిపాడు.
బుల్లెట్ గాయంతో ఒక యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తమ వాళ్ల మరణవార్త తెలుసుకున్న ఆ వర్గాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇటు వైరివర్గం కూడా వారిని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున గుమ్మికూడింది. బిజ్నూర్ వ్యాప్తంగా నెలకొన్ని ఉద్రిక్తత సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరుపక్షాలను చెదగొట్టారు. ప్రస్తుతానికి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ప్రకటించారు.
చనిపోయిన యువకులను అహసాన్, సర్తాజ్, అనీస్ లుగా గుర్తించామని, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులను మృతదేహాలను అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ సౌతం బిజ్నూర్ కల్లోలంపై ప్రత్యేక దృష్టిసారించారు. వేధింపులు, కాల్పుల వ్యవహారంలో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అసలే కుల, మత తారతమ్యాలు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్ లో తాజా ఉదంతం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్లను అణిచివేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఎన్నికల దృష్ట్యా ఈ హత్యాకాండ రాజకీయరంగు పులుముకునే అవకాశం లేకపోలేదు!