దేశం విడిచి వెళ్దామన్నారు: అమీర్‌ఖాన్
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులతో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కూడా గళం కలిపారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని తెలిపారు. అమీర్ సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఒక వ్యక్తిగా, ఈ దేశపు ఒక పౌరుడిగా.. ఏం జరుగుతోందో మనం పత్రికల్లో చదువుతాం. నిజంగా నేను ఆందోళనకు గురయ్యాను.’అన్నారు. కొంతకాలంగా దేశంలో అభద్రతాభావం పెరుగుతోందన్నారు.
ఈ విషయాలపై తన భార్య కిరణ్‌తో మాట్లాడినపుడు.. ‘ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?’అని ఆమె అడిగేవారని చెప్పారు. ‘‘ఆమె తన కొడుకు కోసం భయపడుతున్నారు. మా చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.’’ అని అమీర్ పేర్కొన్నారు. అంతకుముందు ఇదేకార్యక్రమంలో కేంద్ర సమాచార మంత్రి అరున్‌జైట్లీ మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ప్రముఖ వ్యక్తులు ఒక వైఖరిని ప్రకటించటం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్‌నాయర్ రామ్‌నాథ్ గోయెంకా అవార్డునందుకున్నారు.