ఐటీ రైడ్స్లో భారీగా బ్లాక్మనీ!
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న రైడ్స్ లో భారీగా బ్లాక్మనీ బయటపడుతోంది. మొదటి నాలుగు నెలల కాలంలో రూ.3,300 కోట్ల ఆదాయాన్ని ఐటీశాఖ తవ్వి తీసినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్యకాలంలో కనీసం 145 రైడ్స్ను ఆదాయపు పన్ను శాఖ నిర్వహించింది. ఆ రైడ్స్లో రూ.245 కోట్లను లెక్కలో చూపని నగదుగా(బ్లాక్ మనీగా) గుర్తించి ఐటీ శాఖ సీజ్ చేసింది. అంతేకాక నగదు, జ్యువెలరీని తీసివేస్తే, మొత్తంగా లెక్కలో చూపని ఆదాయంగా రూ.3,375 కోట్లను గుర్తించింది. 2015లో మొదటి నాలుగునెలలో లెక్కలో చూపని ఆదాయం రూ.2,252 కోట్లగా ఉండేది.
అదేవిధంగా రూ.85 కోట్ల జువెల్లరీని స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. పన్ను ఎగవేతదారులకు వ్యతిరేకంగా ఈ దాడులను జరుపుతున్నట్టు ఐటీశాఖ వెల్లడించింది. నగదు సీజ్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నట్టు తెలిపింది. అధిక లావాదేవీలు జరుపుతూ టాక్స్ రిటర్న్లు ఫైల్ చేయని కనీసం 90 లక్షల లావాదేవీలపై కూడా ఐటీ శాఖ ఓ కన్ను వేసి ఉచ్చింది. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ, బ్లాక్మనీ బయటకు రావడం లేదని ఐటీ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశమంతటా టాక్స్ రైడ్స్ జరిపి, పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు సిద్ధమైనట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.