ఉపసంఘానిదే తుది నిర్ణయం
- ఉద్యోగుల తరలింపుపై సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపుపై మంత్రివర్గ ఉపసంఘం అన్ని విషయాలను చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని పి.అశోక్‌బాబు నేతృత్వంలోని ఏపీఎన్జీవో నేతల బృందం కలిసింది. విడతల వారీగా ఉద్యోగుల్ని తరలించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పే ప్రొటక్షన్ ఇవ్వాలన్న ఎన్జీవో నేతల వినతిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరించామని, జీతభత్యాలు కూడా పెంచామని గుర్తు చేశారు.
వీటిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు కూడా సహకరించాలని కోరారు. ప్రభుత్వరంగ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 60కు పెంచేలా ఆయా సంస్థల యాజమాన్యాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఎన్జీవో నేతలు సీఎంను కోరారు. అలాగే తెలంగాణాలో విధుల నుంచి తప్పించిన రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల న్యాయపోరాటానికి అవసరమైన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.