కాల్డ్రాప్ పరిస్థితిపై చర్చిద్దాం రండి!
Published Fri, Oct 28 2016 5:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
న్యూఢిల్లీ : వినియోగదారులకు తెగ విసుగు తెప్పించిన కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి మనోజ్ సిన్హా, టెల్కోలతో భేటీ కానున్నారు. నవంబర్ 1న అన్ని టెలికాం కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఆయన భేటీ నిర్వహించనున్నట్టు టెలికాం సెక్రటరీ జే.ఎస్ దీపక్ తెలిపారు. ఈ భేటీలోనే కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితితో పాటు, భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించనున్నారు. కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు దీపక్ తెలిపారు. ఈ సమస్యపై జూన్లో టెలికాం కంపెనీ ఆపరేటర్లతో భేటీ నిర్వహించామని, ఆ భేటీలో టెల్కోలు 100 రోజుల ప్లాన్ హామీగా ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ ప్రొగ్రామ్ ద్వారా కాల్ డ్రాప్స్ పరిస్థితి చక్కబరిచి, లక్ష్యాలను చేధిస్తామన్నారని వాగ్దానం చేసినట్టు చెప్పారు. జూన్10 నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్వర్క్స్లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్వర్క్లు 19కి తగ్గినట్టు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా టెల్కోలు 60వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను) ఏర్పరచనున్నట్టు తెలిపారు. మొదటి 45లో 48వేల స్టేషన్లను టెల్కోలు ఏర్పరిచారు. కాల్ డ్రాప్స్ సమస్య నుంచి బయటపడటానికి బీటీఎస్లు ఏర్పాటుకు టెల్కోలు రూ.12వేల కోట్ల మేర ఖర్చుచేస్తున్నట్టు దీపక్ తెలిపారు.
Advertisement
Advertisement