మర్యాద మంటగలిపారు
- లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ ఎంపీల బూతుపురాణం
- నిండుసభలో పరస్పరం దాడులకు సిద్ధపడ్డ వైనం
- నివ్వెరపోయిన స్పీకర్... నిర్ఘాంతపోయిన సభ్యులు
- సీమాంధ్ర సభ్యులపై మరో ఐదు రోజుల సస్పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువైన పార్లమెంటులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పరస్పర దూషణలతో ముష్టియుద్ధాలకు సిద్ధమవటంతో లోక్‌సభ యావత్తూ నివ్వెరపోయింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల ఎంపీలు సోమవారం సమైక్య రాష్ట్రం నినాదాలతో ఆందోళనలకు దిగటం.. అందులో టీడీపీ ఎంపీ పి.శివప్రసాద్ సభలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాస్కు ధరించి పద్యాలు పాడటం.. దీనికి కాగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహించి ఆయనపైకి దూసుకురావటం.. ఇదిచూసి దిగ్భ్రాంతి చెందిన స్పీకర్.. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయటం.. సభను అర్థంతరంగా వాయిదావేసి వెళ్లిపోవటం.. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పరస్పరం బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే వరకూ వెళ్లటం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నలుగురు టీడీపీ సభ్యులతో పాటు ఐదుగురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ సభ్యులు కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు మొదలుపెట్టారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ అకస్మాత్తుగా ఇందిరాగాంధీ మాస్క్ ధరించి ఆమె ఆత్మ తనను ఆవహించినట్లుగా నటిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి పద్యాలు పాడటం ప్రారంభించారు. స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహం వ్యక్తంచేయటంతో ఆయన మాస్క్ తొలగించినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్.. ఆగ్రహావేశాలతో శివప్రసాద్ వైపుకు దూసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్పీకర్ వెల్‌లో ప్రవేశించిన 9 మందిని మరో ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసి సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం అసభ్యపదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. పరస్పరం ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్‌లను పాలకపక్ష సీనియర్ నాయకులు అడ్డుకోగా.. కాంగ్రెస్ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న శివప్రసాద్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులు సర్దిచెప్పాల్సి వచ్చింది. తమ సుదీర్ఘ పార్లమెంటరీ జీవితంలో ఇంతటి చౌకబారు ప్రవర్తన, పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చే సంఘటనను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్‌సిన్హా, సీపీఐ పక్ష నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా, తదితరులు ఆ తర్వాత సెంట్రల్‌హాల్‌లో ఎదురైన రాష్ట్ర ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.మరోవైపు రాజ్యసభలో కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్‌లు ఆందోళనకు దిగటంతో చైర్మన్ అన్సారీ వారిపై ఒక రోజు సస్పెన్షన్ విధించారు.
స్పీకర్‌కు పరస్పరం ఫిర్యాదులు
సభామర్యాదలను మంటగలిపిన శివప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేసిన మిగిలిన టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్, తెలంగాణ ఎంపీలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో టీడీపీ సభ్యుడిపై అసభ్య పదజాలంతో దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ప్రభుత్వ ఛీఫ్‌విప్ సందీప్ దీక్షిత్‌పై ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్‌లు కూడా స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ సీమాంధ్ర పార్టీ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా విభజనపై వైఖరేంటో ఆ పార్టీ అధినేత చంద్రబాబును నిలదీయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు.