
ఐఎస్ఐఎస్ నగదు ధ్వంసం వీడియో విడుదల
వాషింగ్టన్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని మసూల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చెందిన నగదు డిపో ధ్వంసానికి సంబంధించిన వీడియోను శనివారం వాషింగ్టన్లోని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఐసిస్ నగదు డిపోపై యూఎస్ బాంబుల వర్షం కురుపించింది. దీంతో డిపోలోని నగదు గాలిలోకి లేచి చెల్లాచెదురయింది.
అయితే డిపోలో ఎంత నగదు ఉంది, అది ఏ దేశ కరెన్సీ అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేమని ఉన్నతాధికారులు వెల్లడించారు. నగదు మాత్రం మిలియన్లలో ఉందని మాత్రం స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్కు చెందిన నగదు డిపోపై దాడి ఓ మంచి పరిణామం అని యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ లాయిడ్ అస్టిన్ తెలిపారు. ఐఎస్ఐఎస్కి మారు పేరుగా కొనసాగుతున్న ఐఎస్ఐఎల్కి చెందిన గ్యాస్, చమురు ఉత్పత్తితోపాటు ఈ సంస్థకు ఆర్థిక మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేస్తామని చెప్పారు.
కాగా మసూల్లో నగదు డిపోపై చేసిన దాడి మొదటిది కాదని అస్టిన్ చెప్పారు. ఐఎస్ఐఎస్లో చేరి యుద్ధం చేసేవారికి ఐఎస్ఐఎల్ నుంచి నిధులు అందుతున్నాయని, అలాగే కొత్తగా ఈ సంస్థలో వ్యక్తులను చేర్చుకునేందుకు చర్యలు చేపడుతుందని వెల్లడించారు. వీటితోపాటు ఈ సంస్థకు వివిధ మార్గాల్లో అందుతున్న వనరులను నిరోధించేందుకు చర్యలు చేపడతామని అస్టిన్ పేర్కొన్నారు. కాగా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సదరు వీడియోలో శబ్దం మాత్రం లేదు.