కావేరి వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ కావేరీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర జలాల వివాదాల నదీ ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్విట్టర్ లో తన ఫీలింగ్స్ ను షేర్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. కావేరీ జలాల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ఆదిమానవుల కాలంనుంచి కొనసాగుతోందనీ, ఇది మన తరం తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. మానవుడు వానరాలుగా.. భాష నేర్వక సంచరిస్తున్న కాలంలో పుట్టిందనీ.. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు. చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలా చూసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
కాగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం హింసాత్మకం రూపం దాల్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలను కన్నడిగులు తగులబెట్టారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. ఐటీ సహా, పలు వ్యాపార సంస్థలు మూతపడడంతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా జరిగిన పోలీసులు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.