
రాజ్యసభలో కలకలం రేపిన సీఎం
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం రాజ్యసభలో అడుగు పెట్టడంతో గందరగోళం రేగింది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. గోవా ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పరీకర్ జీరో అవర్ లో సభలోకి అడుగుపెట్టారు.
పరీకర్ రాకను గమనించిన కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీఏ హరిప్రసాద్ తదితరులు తమ స్థానాల్లో నిలబడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీకర్ కు మద్దతుగా బీజేపీ సభ్యులు కూడా నిలబడి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం రేగింది. సభ్యులకు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రాజీవ్ గౌడ, హుస్సేన్ దాల్వాయ్ తదితర కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి పరీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు విపక్ష సభ్యులకు మరింత ఆగ్రహం కలిగించాయి. గోవా కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేందుకు పరీకర్ సభకు వచ్చారని నఖ్వి వ్యంగ్యంగా అనడంతో బీజేపీ బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. రక్షణ మంత్రి పదవికి పరీకర్ రాజీనామా చేసిన గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ్యకు పరీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.