ప్రసూతి చట్టం.. మహిళల ఉద్యోగాలకు ఎసరు!
న్యూఢిల్లీ: దేశంలోని మహిళా ఉద్యోగులకు 26 వారాలపాటు ప్రసూతి సెలవులను వర్తింప చేస్తూ భారత ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అయితే ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయనే ఆందోళన మరోపక్క వ్యక్తం అవుతోంది. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, చిన్న, మధ్యతరహా కంపెనీలు, స్టార్టప్ కంపెనీలకు చెందిన 4,300 మంది అభిప్రాయాలు సేకరించగా, వారిలో 26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు.
తాము ఇక మహిళలకు బదులుగా పురుషులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వారు చెప్పారు. 40 శాతం మంది ఎప్పటిలాగే మహిళలను తీసుకుంటామని చెప్పారు. వారి ప్రసూతి సెలవుల కారణంగా తమపై పడే ఆర్థిక భారానితో పోలిస్తే వారు తమకు అవసరమైన సమర్థులా అన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని వారు చెప్పారు. ప్రసూతి సెలవులను పెంచడం వల్ల మహిళల ఉద్యోగావకాశాల్లో ఎలాంటి మార్పు ఉంటుందని తాము భావించడం లేదని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏమీ చెప్పలేమని 12 శాతం మంది చెప్పారు.
భారత్ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు.
మహిళా ఉద్యోగులకు ఆరు నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయడం, ఓ కంపెనీలో 30 మంది మహిళలు పనిచేస్తున్నా లేదా 50 మంది ఉద్యోగులున్నా కంపెనీలో లేదా 500 మీటర్ల వ్యాసార్ధంలో బీబీ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అందుకయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరించాలి. ఈ కారణంగా వ్యాపారంపై, అంటే లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్టార్టప్, చిన్న, మధ్య తరగతి వ్యాపార సంస్థల వ్యాపారవేత్తల్లో 35 శాతం మంది భావిస్తుండగా, ప్రసూతి సెలవులను పెంచుతూ తెచ్చిన చట్టాన్ని 39 శాతం మంది స్వాగతించారు.