
మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట లభించింది. తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలంటూ మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ఏసీబీకి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ అందుకు ఈనెల 24వ తేదీని గడువుగా విధించింది. కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఈలోపు తన క్లయింటును అరెస్టు చేయకుండా చూడాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దాంతో మత్తయ్య అరెస్టుపై ఈనెల 24వ తేదీ వరకు హైకోర్టు స్టే విధించింది. స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బులతో గానీ, ఈ కేసుతో గానీ తనకు సంబంధం లేదని, అందువల్ల తనను ఈ కేసు నుంచి తప్పించాలని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు.