మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను! | Mission Tripura: The BJP is now eyeing a fourth North Eastern state | Sakshi
Sakshi News home page

మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను!

Published Wed, Mar 29 2017 3:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను! - Sakshi

మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను!

న్యూఢిల్లీ: ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్‌లలో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు త్రిపుర మీద కన్నేసింది. రెండు దశాబ్దాలకుపైగా మార్క్సిస్టుల పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో కూడా కాషాయపు జెండాను ఎగురవేయాలనుకుంటోంది. అందుకనే మున్నెన్నడు లేనివిధంగా, అంటే పాలకపక్ష సీపీఎం కూడా ఎన్నడూ నిర్వహించనంత భారీ స్థాయిలో ఆదివారం నాడు రాష్ట్ర రాజధాని అగర్తలాలో భారీ బలప్రదర్శనకు దిగింది. స్వామి వివేకాంద స్టేడియం కాషాయ జెండాలతో రెపరెపలాడింది.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలోని తరుణ్‌ గొగోయ్‌ నాయకత్వంలోని 15 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడం ద్వారా బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత డిసెంబర్‌ నెలలో ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంలో ‘పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఆరుణాచల్‌’కు చెందిన 33 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా ప్రభుత్వాన్ని దక్కించుకుంది. ఇప్పుడు బీజేపీ కన్ను త్రిపుర మీద పడింది.

60 సీట్ల త్రిపుర అసెంబ్లీలో 51 సీట్లతో సీపీఎం ఎదురులేని పాలనను కొనసాగిస్తోంది. మిగతా తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్, మూడు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. బీజేపీకి ఒక్కస్థానం కూడా లేదు. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో 1.54 శాతం ఓట్లు సాధించడం ద్వారా అంతోఇంతో ఉనికిని చాటుకుంది. ఇక 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఓ సీటును సాధించడం ద్వారా బీజేపీ తన బలాన్ని ఒక్కసారిగా పెంచుకుంది. మరో సీటులో సీపీఎం పార్టీ విజయం సాధించిన విషయం తెల్సిందే. 2015లో జరిగిన ‘త్రిపుర ట్రైబల్‌ ఏరియాస్‌ అటానమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌’ ఎన్నికల్లో అన్ని సీట్లను వామపక్షమే గెలుచుకున్నప్పటికీ ఐదు సీట్లలో బీజేపీ రెండవ స్థానంలో నిలవడం విశేషం. బీజేపీ కన్నా కాంగ్రెస్‌ మరింత వెనకబడిపోవడం, గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీపీఎం ఓట్లు పదిశాతానికి తగ్గిపోవడం బీజేపీ బలపడుతుందనడానికి ప్రత్యక్ష సూచికలు.

ఆ తర్వాత 2015లోనే జరిగిన ప్రతాప్‌గఢ్, సుర్మాహ్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ రెండవ స్థానంలో నిలవడం విశేషం. ఈ రెండు స్థానాలకు తిరిగి పాలకపక్షమే దక్కించుకుంది. ఈ రెండు స్థానాల్లో గత రెండు పర్యాయాలు రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ మూడవ స్థానానికి పడిపోవడం గమనార్హం. 2016లో బర్జాలా అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ 36 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 2015 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 22 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి 2016 అసెంబ్లీ ఉప ఎన్నికల నాటికి ఓట్ల శాతం 36కు పెరగడం పార్టీ బలోపేతాన్ని సూచిస్తోంది.

ఈ ఎదుగలను చూసి మార్క్సిస్టు పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఇప్పుడు మాకు నిజమైన ప్రతిపక్షమంటే బీజేపీనే. కేంద్రంలో అధికారంలోవున్న ఆ పార్టీ క్రమంగా పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఈ కారణంగా ఆ పార్టీకి పెరగుతున్న బలాన్ని తక్కువగా అంచనా వేయలేం’ అని సీపీఎం త్రిపుర శాఖ ప్రధాన కార్యదర్శి బిజన్‌ ధార్‌ వ్యాఖ్యానించారు. బీజీపీలో స్వతహాగా గుర్తింపు పొందిన నాయకులు లేకపోవడంతో ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో 65 మంది సభ్యులుండగా, వారిలో 16 మంది నాయకులు సహా 400 మంది ఆ పార్టీ కార్యకర్తలు మార్చి 22వ తేదీన బీజేపీలో చేరడం ఇక్కడ గమనార్హం. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా పెద్ద సంఖ్య పార్టీ కార్యకర్తలు బీజేపీకి తరలివచ్చారు. ముఖ్యంగా స్థానిక గిరిజనలకు చెందిన ‘పీపుల్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ త్రిపుర’ నుంచి కూడా బీజేపీకి వలసలు రావడం గమనార్హం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ త్రిపురతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లయితే లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర 60 అసెంబ్లీ సీట్లలో మూడోవంతు సీట్లు గిరిజనులకు ప్రత్యేకంగా కేటాయించినవే అవడం. అక్కడ చారిత్రక కారణాల వల్ల ప్రజలు మొదటి నుంచి సీపీఎంకే ఓటు వేస్తుండడంతో ప్రతిసారి ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement