
కట్నం కోసం మరదలిపై నటుడి దాడి!
కట్నం కోసం సోదరుడి భార్యపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించారు.
లక్నో: కట్నం కోసం సోదరుడి భార్యపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించారు. పబ్లిసిటీ కోసమే ఆమె తనపై ఆరోపణలు చేసినట్టు ఆయన చెప్పారు. గత నెల 28న తన తమ్ముడి భార్య ఆఫ్రిన్‌ను నవాజుద్దీన్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.
కట్నం కోసం అతను తనను వేధించినట్టు ఆఫ్రిన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను నవాజుద్దీన్ సిద్ధిఖీ తోసిపుచ్చారు. తనను సాఫ్ట్ టార్గెట్‌గా భావించి ఉద్దేశపూరితంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని, తాను నటుడిని కావడంతో ఈ ఆరోపణలు చేయడం ద్వారా టీవీల్లో, పత్రికల్లో వెలుగులోకి రావొచ్చునని ఆమె భావించిందని చెప్పారు.
కట్నం కోసం తన మరదల్ని ఎప్పుడూ వేధించలేదని తెలిపారు. నిజానికి ఆఫ్రిన్ మామే తన తమ్ముడు మినాజుద్దీన్ డబ్బు కోసం నిత్యం వేధించేవాడని చెప్పారు. సెప్టెంబర్ 28న తాను తీవ్ర జ్వరంతో ఉన్నానని, ఆఫ్రిన్ అత్త, మామ డబ్బు దొంగలించాలనే ఉద్దేశంతో ఆ రోజు తమ ఇంటికి వచ్చి గలాటా సృష్టించారని, అయినా తాను కొట్టడంగానీ, కనీసం ఆమెను తాకడం కానీ చేయలేదని, ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయని వివరించారు.