
అటు బీభత్సం.. ఇటు సంతోషం
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3వేల ఇళ్లు కూలిపోయాయి.. వర్షాలు దండిగా కురుస్తుండటంతో ఈ ఏడు సాధారణం కంటే 2.5 శాతం అధికంగా రైతులు పంటలు పండించబోతున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3వేల ఇళ్లు కూలిపోయాయి. 1.47 లక్షల మంది తమ ఇళ్లను వదిలిపెట్టారు. ఊళ్లని వరదనీరు ముంచెత్తింది. మహా నగరాలైతే నరకానికి నకళ్లుగా మారాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనం అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీ కావు.
వర్షాలు దండిగా కురుస్తున్నాయి. జులై మాసంలో 7శాతం అధిక వర్షపాతం నమోదయింది. దీంతో వ్యవసాయ పనుల వేగం పెరిగింది. ఈ ఏడు సాధారణం కంటే 2.5 శాతం అధికంగా రైతులు పంటలు పండించబోతున్నారు. ఇది దేశ ఆర్థిక ప్రగతికి శుభసూచకం.
ఇవీ.. ఇటీవలి భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా నెలకొన్ని పరిస్థితి. ఓ వైపు బీభత్సాన్ని, మరోవైపు సంతోషాన్ని నింపి వెళ్లింది జులై మాసం. గత నెల (జులై)లో సరాసరి ఏడు శాతం అధిక వర్షపాతం నమోదయిందని భారత వాతావరణశాఖ ప్రకటించింది.
దక్షిణ భారతంలో జులై ముగిసేనాటికి ఎక్కువలో ఎక్కువ వర్షపాతం 106 శాతం నమోదయ్యేది కానీ ఈ ఏడాది అది 113 శాతానికి పెరిగింది. అంటే ఏడు శాతం అధికం అన్నమాట. ఇక వాయువ్య భారతంలో 106 శాతం, మధ్య భారతంలో 113 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 94 శాతం పాతం నమోదయినట్లు భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సరాసరి 7 శాతం అధిక వర్షాలు పడ్డాయని, ఆగస్టులోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని పేర్కొంది.
కూలుతున్న బతుకులు:
వర్షాలు, వరదల ధాటికి దేశవ్యాప్తంగా 3 వేల ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని థానేలో ఆదివారం ఓ భవంతి కూలి 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడటం, వరదల్లో చిక్కుకోవడం లాంటివేకాక పిడుగుపాట్లకు కూడా జనం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. నమోదయిన 74 మరణాల్లో అత్యధిక శాతం (32) అసోంలో సంభవించినవేకావడం అక్కడి తీవ్రపరిస్థితిని తెలుపుతున్నది. వరదలు పరోక్షంగా 16 లక్షల మందిపై ప్రభావాన్ని చూపాయి. ఆయా రాష్ట్రాల్లో 310 సహాయక శిబిరాలను ఏర్పాటుచేశారు. వరదల్లో చిక్కుకుపోయిన 1729 మందిని కాపాడారు.
నైరుతి రుతుపవనాలకు అల్పపీడన ద్రోణులు తోడుకావడంతో భారత్ తోపాటు బంగ్లాదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగ్లాలో వర్షాల ధాటికి 15 మంది చనిపోయారు. అటు భూకంప బాధిత దేశం నేపాల్ లోనూ వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.