లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: శరద్పవార్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకుడదని నిర్ణయించుకున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరత్ పవార్ వెల్లడించారు. ఇంకా ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఎలా ఉంటాను అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సీఎన్ఎన్-ఐబీఎన్ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నారా అని ఆ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శరత్ పవార్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుడదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే రాజ్యసభకు వెళ్లవచ్చు అని ఆయన ఈ సందర్భంగా చమత్కరించారు. అది ఒక్కటే ఉన్న ఎకైక మార్గమని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నిడివి లేకుండా పార్లమెంట్ లేదా లోక్సభ సభ్యునిగా 46 ఏళ్లుగా కొనసాగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన మంత్రి పదవి రేసులో ఎందుకు లేరు అన్న ప్రశ్నకు శరద్పవార్ స్పందిస్తూ... సమాజంలో అన్ని వర్గాల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే వారితో మంచి స్నేహం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆ అత్యున్నత పదవిని ఆశించడం లేదన్నారు. తాను వాస్తవిక రాజకీయవాదినని శరద్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
1967లో మహారాష్ట అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికై శరద్పవార్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ, ఆహార మంత్రిత్వశాఖలను నిర్వహించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ సర్కార్లో ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్గాంధీకి అత్యంత సన్నిహితుల్లో శరద్ పవార్ ఒకరు.
అయితే 1991లో రాజీవ్గాంధీ హత్యానంతరం ఆయన ప్రధాన పదవికి రేసులో ఉన్నారు. అయితే ఆ పదవి పీ.వీ.నరసింహరావును వరించింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ క్రమంలో మాజీ లోక్సభ స్పీకర్ పీ.ఏ.సంగ్మా, తారీఖ్ అన్వర్లతో కలసి ఎన్సీపీని స్థాపించారు. 1999లో కాంగ్రెస్పార్టీ,ఎన్సీపీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.