'భార్యాబిడ్డలు ఓడిపోయినా బుద్ధి రాలేదు'
పాట్నా: 'సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భార్య, కూతుర్లు చిత్తుగా ఓడిపోయారు. బొటాబొటి ఓట్లతో డిపాడిట్ మాత్రమే దక్కించుకోగలిగారు. అయినా సరే ఆ నేతకు బుద్ధి రాలేదు. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యుల్ని చట్టసభలో కూర్చోబెడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు' అంటూ ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్.
ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాలూ సహా బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో లాలూ సతీమణి రబ్రిదేవి, కుమార్తె మీసా భారతిలు ఇద్దరూ ఓటమి చెందిన విషయం తెలిసిందే. 'బీహార్ లో ఇద్దరు పొగరుమోతు నాయకులున్నారు. ఒకరికేమో తన కుటుంబ ఉన్నతి తప్ప మరేదీ పట్టదు. ఇంకొకాయన తాను సమర్థుడినని ప్రచారం చేసుకోవడంతప్ప పనేమీ చేయరు' అంటూ లాలూ, నితీశ్ లను దాస్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ఓటర్లు జేడీయూ, ఆర్ జేడీలను పాతిపెట్టి.. బీజేపీకి విజయాన్ని అందించాలని కోరారు.