చర్చలు లేకుండానే నిరవధిక వాయిదా
ఎలాంటి చర్చలు లేకుండానే రాజ్యసభ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ సభకు వచ్చిన కొద్ది సేపటికీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ హమ్మీద్ అన్సారీ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటి నుంచి పెద్దనోట్ల రద్దు, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో పాటు ఇతర అంశాలు రాజ్యసభను కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటంతో ఒక్క రోజు కూడా ఎలాంటి చర్చలేకుండానే రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
కేవలం రెండు బిల్లులను మాత్రమే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించారు. ఒకటి పెద్ద నోట్ల రద్దు తర్వాత తేలే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన సవరణలతో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం. ఆ బిల్లు లోక్సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. రెండోది గత యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకొచ్చిన దివ్యాంగుల చట్ట సవరణ బిల్లు. 119 సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లును ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది. అసమ్మతి, అంతరాయం, ఆందోళనల మధ్య వ్యత్యాసాన్ని అన్ని సెక్షన్ల వారు తమను తాము పరిశీలించుకోవాల్సినవసరం ఉందని వైస్ ప్రెసిడెంట్ హమ్మీద్ అన్సారీ అన్నారు.