దమ్ముంటే నన్ను జైలులో పెట్టండి..
'ప్రజల తరఫున మాట్లాడితే నోటీసులు పంపారు. ఒకటికాదు.. రెండుకాదు.. అలాంటి నోటీసులు వంద పంపినా భయపడను. ఇదే గడ్డమీద నిలబడి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి. కటకటాల్లోకి నెట్టినా నేనెప్పుడూ ప్రజల గొంతుకనే వినిపిస్తా..' అంటూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీలో ఆదివారం పర్యటించిన ఆమె.. స్థానిక బీజేపీ శ్రేణులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు.
రాహుల్ గాంధీకి చెందిన స్వచ్ఛంద సంస్థ భూ కబ్జాలకు పాల్పడిందంటూ గతంలో స్మృతి చేసిన విమర్శలపై మండిపడ్డ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్మృతి ఇరానీకి లీగల్ నోటీసులు పంపడం తెలిసిందే. ఆదివారం నాటి ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి దేనికీ తాను భయపడబోనన్నారు.