
తక్కువ రెమ్యూనరేషన్.. షాకిచ్చిన నటి!
బాలీవుడ్ పరివారమంతా ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లి అట్టహాసంగా జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నది. కానీ, ప్రియాంక చోప్రా మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంది. తన మరాఠీ ప్రొడక్షన్ సినిమా 'క్యా రే రాస్కేలా' ప్రమోషన్, కుటుంబసభ్యులు, సన్నిహితులతో తన 35వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆమె ఐఫాకు డుమ్మా కొట్టింది. బిజీ సినీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకొని కుటుంబసభ్యులతో గడిపేందుకు తాను ఐఫా వేడుకలకు వెళ్లడం లేదని ప్రియాంక వివరణ ఇచ్చినా.. 'ముంబై మిర్రర్' మాత్రం తాజాగా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఈ ఏడాది ఐఫాలో ఓ నృత్య ప్రదర్శన ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు జనవరిలోనే ప్రియాంకను కలిశారట. అంతేకాకుండా వేడుకలో ఓ సెగ్సెంట్‌కు హోస్ట్‌గా ఉండాలని కోరారట. అయితే, ఇందుకు ప్రియాంక అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించట. మరీ ముఖ్యంగా కేవలం వేడుకలో కనిపిస్తే చాలు అంటూ ఒక 'మేల్ సూపర్‌స్టార్'కు అత్యంత భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పిన నిర్వాహకులు.. ఆయన కంటే తక్కువగా తనకు డబ్బు ఇస్తామనడంతో ప్రియాంక నొచ్చుకున్నారని, అందుకే ఈ వేడుకకు డుమ్మా కొట్టారని ఆ పత్రిక తెలిపింది. ఆ మేల్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌నేనని సంకేతాలు ఇచ్చింది. సల్మాన్ కన్నా తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఐఫాకు 'దేశీ గర్ల్' ఇలా షాక్ ఇచ్చారని తెలిపింది.