
వైఎస్ ఉంటే ఇలా జరిగేదా : అంబటి రాంబాబు
విభజనపై ప్రతి ఒక్కరి మదిలోనూ ఇదే ప్రశ్న
చంద్రబాబు యాత్ర ఉద్యమంపై నీళ్లు చల్లేందుకే
సీమాంధ్రులకు రూ. నాలుగైదు లక్షల కోట్లకు ఖరీదు కట్టిన చంద్రబాబు అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు
వైఎస్ 4వ వర్ధంతిని ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను చూసి ‘వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఇలా ఉండేదా!’ అని రాష్ట్రంలో మేధావులు, ప్రజలు భావిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ కనుక జీవించి ఉంటే సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా చీల్చే ప్రయత్నం చేసి ఉండేవారా? అనే ప్రశ్నకు అన్ని వైపుల నుంచీ ‘లేదు’ అనే సమాధానమే వస్తుందని అభిప్రాయపడ్డారు.
వైఎస్ పరిపాలించిన 5 ఏళ్ల 3 నెలల కాలంలో రాష్ట్రాన్ని విభజించాలనే యత్నం జరగలేదని, విభజించాలనే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతూ వచ్చిందే తప్ప పెరిగిన సందర్భమే లేదన్నారు. అంతేకాదు, ధరలు పెరిగినపుడు, ఆర్టీసీ చార్జీలు పెరిగినపుడు, విద్యుత్ చార్జీలు పెరిగినపుడు, రాష్ట్రం అతలాకుతలం అవుతున్నపుడు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నపుడు ప్రతి ఒక్కరికీ వైఎస్ గుర్తుకు వస్తున్నారని, ఆయన ఉంటే ఇలా జరిగేదా అనే గుండెలు పిండేసిన బాధ కలుగుతోందని అన్నారు. చివరకు ఢిల్లీలో విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం కలిసినపుడు సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకున్నారని ఆయన అన్నారు.
అదో పీడకల..
వైఎస్ మర ణం అందరికీ ఒక పీడకల అని, సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా, వాడవాడలా ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అంబటి పిలుపునిచ్చారు. విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. పైనుంచి చూస్తున్న వైఎస్‌ను.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్ది ఆశీర్వదించాలని కోరుతూ ఆయన విగ్రహాలకు పార్టీ శ్రేణులు వినతి పత్రాలు కూడా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానాలు, అన్నదానం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
యాత్ర ఎందుకో చెప్పండి చంద్రబాబూ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రను దేని కోసం చేస్తున్నారో చెప్పి ఆ తరువాతనే బయలుదేరాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి తొలి నుంచీ పోరాడుతున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బాబు వాలకం చూస్తుంటే.. సమైక్యాంధ్ర ఉద్యమంపై నీళ్లు చల్లడానికే వెళుతున్నారని అనిపిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత విలేకరుల సమావేశంలో బాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే రాజధానిని నిర్మించుకుంటామని చెప్పడం అంటే, దానర్థం ఏమిటి? ఈ అడ్డగోలు విభజనను బాబు అంగీకరిస్తున్నట్లు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. సీమాంధ్రులను నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఖరీదు కట్టిన బాబు అక్కడ ప్రవేశించడానికి వీల్లేదని అంబటి అన్నారు.
2న తిరుపతిలో షర్మిల సభ
సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగానే ఉంచాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీ నుంచి చేపట్టబోయే బస్సు యాత్రను విజయవంతం చేయాలని అంబటి కోరారు. సీమాంధ్రలోని 13 జిల్లాలను నాలుగైదు వారాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనివివరించారు. ఆ రోజున ఉదయం షర్మిల ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో షర్మిలతో పాటుగా పలువురు పార్టీ నేతలు ప్రసంగిస్తారని అంబటి తెలిపారు. షర్మిల బస్సు యాత్ర ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.