
'చంద్రబాబు ఒత్తిడి తేవడం దుర్మార్గం'
హైదరాబాద్: సెక్షన్ - 8ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో కర్నె ప్రభాకర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సెక్షన్ -8 ను టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని... విభజన బిల్లు రూపకల్పనప్పుడే యూపీఏ పెద్దలకు తమ పార్టీ నేత కేసీఆర్ తెగేసి చెప్పారన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఏడాది కాలంగా హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి... ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇబ్బందులు ఉన్నాయనటం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి కార్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒత్తిళ్లకు కేంద్రం సెక్షన్ - 8 అమలు చేస్తుందని టీఆర్ఎస్ భావించడం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓ వేళ అదే జరిగితే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాక్షేత్రంలో పోరాడుతామని కార్నె ప్రభాకర్ వివరించారు.