
పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది: విజయమ్మ
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందని, నెలరోజులుగా ఉద్యమం జరుగుతూ ఉన్నా, రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోతున్నా కేంద్రం నుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ ఒక్క మాట కూడా రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల పట్ల జగన్ చాలా బాధపడ్డారని, విభజన చేస్తున్నారని తెలిసి వైఎస్ కలలుగన్న రాష్ట్రం ఇలా అయిందేమిటని కలత చెందారని ఆమె అన్నారు. శుక్రవారం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు విభజనను నివారించాలని జగన్ దీక్ష చేస్తానన్నపుడు తాను నివారించినా వినలేదని ఆమె అన్నారు.
ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న జగన్‌ను చూడటానికి వెళితే అనుమతించలేదని, చివరకు శోభా నాగిరెడ్డి తదితరులు ఇక్కడే ధర్నా చేస్తామని హెచ్చరించిన తరువాత తనను మాత్రమే లోపలికి పంపారని ఆమె వివరించారు. జగన్ కోసం ఎక్కడా దుందుడుకు చర్యలకు పాల్పడరాదని, నిరసనలు శాంతియుతంగానే తెలపాలని విజయమ్మ అందరికీ విజ్ఞప్తి చేశారు. ‘మనం ప్రజల కోసం పోరాడుతున్నాం.. ప్రజల పక్షాన నిలబడుతున్నాం. కనుక ప్రజల కోసం బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దీక్ష విరమించాలని జగన్‌ను కోరతా...’ అని విజయమ్మ అన్నారు. జగన్‌కు, రాష్ట్రానికి అంతా మేలు జరగాలని దేవుడిని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ఆమెతో పాటుగా మీడియా సమావేశంలో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, భూమా శోభానాగిరెడ్డి పాల్గొన్నారు.