
ఉత్థానపతనాలు!
టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా ఎవరూ ఊహించని ప్రకటన విడుదల చేసి దిగ్భ్రాంతిపరిచింది. డోప్ పరీక్షలో తాను విఫలమయ్యానని వెల్లడించింది. ఆమె అతి ముఖ్యమైన ప్రకటనొకటి చేస్తారని షరపోవా ప్రతినిధి వెల్లడించినప్పుడు అందరూ అనుకున్నది వేరు. గాయాలతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న షరపోవా ఇక ఆటకు గుడ్‌బై చెప్పవ చ్చునని అంచనా వేశారు. షరపోవా చేసిన ప్రకటన పర్యవసానం అదే అయినా డోపింగ్ వివాదంలో ఆమె చిక్కుకుంటుందని, అందువల్ల ఆమెకు నిష్ర్కమణ తప్పనిసరవుతుందని ఎవరూ అనుకోలేదు.
షరపోవాను ఆరాధ్య దేవతగా కొలిచే కోట్లాదిమంది టెన్నిస్ అభిమానులకు నిస్సందేహంగా ఇదొక షాక్. క్రీడాస్థలిలో చేతిలో రాకెట్‌తో నిల్చున్న నిలువెత్తు షరపోవాలో అందాన్ని మాత్రమే చూసేవా రుండొచ్చు. ఆమె ఆటను మెచ్చుకునేవారుండొచ్చు. ఆమె నేపథ్యం గురించి, ఆమె ఎదిగివచ్చిన తీరు గురించి తెలిసినప్పుడు...ఎంత అనుభవం గడించినా ఆట విషయంలో ఇప్పటికీ పాటించే శ్రద్ధాసక్తులను గమనించినప్పుడు షరపోవా వ్యక్తి త్వంపై గౌరవం ఏర్పడుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అమెరికాకు వలస పోవడంవల్ల అదనంగా వచ్చి చేరిన కష్టాలకు ఎదురీదుతూ అనా రోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఏడేళ్ల వయసునుంచీ టెన్నిస్‌పై పట్టు సాధించ డానికి షరపోవా చేసిన కృషి అనితరసాధ్యమైనది. అమ్మకు దూరంగా ఉండాల్సి వచ్చినా, తనతోపాటు వచ్చిన తండ్రి దేశం కాని దేశంలో మనుగడ కోసం చిరు ద్యోగిగా ఎక్కడో పనిచేయాల్సివస్తున్నా టెన్నిస్ క్రీడపై నిమగ్నతను ఆమె చెదరని వ్వలేదు. పదహారేళ్ల చిరుప్రాయంలో వింబుల్డన్ సింగిల్స్ గెల్చుకుని దేశదేశాల్లోని టెన్నిస్ ప్రియులనూ ఆమె ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వరసగా యూఎస్ ఓపెన్ (2006), ఆస్ట్రేలియన్ ఓపెన్(2008) సాధించింది. 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. ఎందరికో ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ప్రతి ఆరంభానికీ ఒక ముగింపు ఉంటుంది. కానీ షరపోవాను ఇన్నేళ్లుగా చూస్తున్నవారికి ఈ ముగింపు ఊహించనిది. ఆటలో మెరుగైన పాటవాన్ని ప్రదర్శించడం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడటం అంతర్జాతీయ పోటీల్లో ఒక ధోరణిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని నిబంధనలు తీసుకొస్తున్నా దీన్ని అరికట్టడం వీలుకావడంలేదు. ఈ విషయంలో రష్యాపై తరచు ఆరోపణలు వస్తుంటాయి. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ, ఇతర అంతర్జాతీయ పోటీల్లోనూ పతకాలను గెల్చుకుందుకు రష్యా కావాలనే అథ్లెట్లకు ఇలాంటి అలవాట్లు చేసిందని ప్రపంచ డోపింగ్ సంస్థ(వాడా) ఆమధ్య ఒక నివేదికలో ఆరోపించింది. పర్యవసానంగా రాబోయే అంతర్జాతీయ ఈవెంట్లలో...ముఖ్యంగా రియో డి జెనిరోలో ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనే సందేహాలు కూడా వినబడుతున్నాయి. దేశానికి ఇలా తలవంపులు తీసుకొచ్చే చేష్టల్ని సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా దాన్నెవరూ విశ్వసించలేదు. ఆటల్లోకి రాజకీయాలు జొప్పించడంవల్లే గోరంతను కొండంతలు చేస్తున్నారన్నది రష్యా ఆరోపణ. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆ దేశానికే చెందిన షరపోవాపై ఉత్ప్రేరకాల నింద పడటం గమనార్హం.
చాలా పెద్ద తప్పు చేశానంటూ షరపోవా తనంత తానే ప్రకటన చేశారు. అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశానని, ఈ ఆటకు అపఖ్యాతి తెచ్చానని కూడా ఆమె అంగీకరించింది. వాస్తవానికి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇందుకు సంబంధించిన ప్రకటన చేయడానికి ఇంకా అయిదు రోజుల వ్యవధి ఉంది. ఈలోగా తానే ఈ సంగతిని ప్రపంచానికి వెల్లడించడం ద్వారా ఇందుకు సంబం ధించి మీడియాలో వెల్లువెత్తే కథనాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె భావించినట్టు కనబడుతోంది. ఈ ప్రకటన చేసిన సందర్భంలో ఆమె వ్యక్తంచేసిన హావభా వాలైనా, ఆమె చెప్పిన జవాబులైనా షరపోవాపై ఉన్న విశ్వాసాన్ని సడలనీయవు. అన్యాయంగా ఇందులో చిక్కుకుపోయామని కన్నీటిపర్యంతమయ్యేవారినీ, తమ తప్పేమీ లేదని దబాయించేవారినీ చూసినవారికి షరపోవా తీరు భిన్నంగా కనబడు తుంది. పదేళ్లుగా ఈ మందు వాడుతున్నానని, మూడు నెలలక్రితం నిషేధిత ఉత్ప్రే రకాల జాబితాలో ఇది చేరిందని తెలియక అలవాటుగా వాడానని షరపోవా చెప్పిన మాటను విశ్వసించవచ్చుననే అనిపిస్తుంది. అయితే షరపోవా వ్యక్తిమాత్రురాలు కాదు. ఆమె కోసం పనిచేసేందుకు ఒక ప్రత్యేక బృందం ఉంటుంది. ఆటలో ఎలాంటి నిబంధనలొస్తున్నాయో, ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఆ బృందంలోనివారిలో ఒక్కరైనా చెప్పలేదంటే నమ్మకం కలగదు. పైగా నిరుడంతా ఈ ఔషధం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. దాని పనితీరు గురించి నిఘా ఉంది. గుండె కండరాలు దెబ్బతినడంవల్ల తగినంత పరిమాణంలో ఆక్సిజన్ అందని రోగులకు ఈ ఔషధాన్ని వాడితే ఆక్సిజన్ అవసరాన్నిది తగ్గిస్తుందట.
గుండెకు తక్కువ పరిమాణంలో ఆక్సిజన్ సరిపోయేలా చేసే గుణమే ఆటగాళ్లలో ఈ ఔషధ ప్రాముఖ్యాన్ని పెంచింది! తూర్పు యూరప్ వెలుపల ఈ సంగతి ఇన్నాళ్లూ తెలియకపోవడంవల్లే రష్యా తదితర దేశాల క్రీడాకారులు దీన్ని యధేచ్ఛగా వినియోగించారని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిణామం పర్యవసానంగా నైకి, పోర్షే, ట్యాగ్‌హ్యూయేర్ లాంటి పేరెన్నికగన్న బ్రాండ్‌లన్నీ ఆమెతో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ప్రచార ఒప్పందాలను తెగదెంపులు చేసుకుం టున్నట్టు ప్రకటించాయి. విజేతలను మాత్రమే కీర్తించే ప్రపంచంలో ఇలాంటివి మామూలే. ఇప్పుడు టెన్నిస్ సమాఖ్య విధించిన నిషేధం తాత్కాలికమైనదే. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పా, తెలియక జరిగిందా అన్నది విచారణలో తేలాకే అసలు శిక్ష ఖరారవుతుంది. గెలుపోటముల్నే కాదు... చేసిన తప్పుల పర్యవ సానంగా వచ్చే ఈ మాదిరి ఉత్పాతాలనూ ఎదుర్కొనే స్థిర చిత్తం ఆటగాళ్లకు అవసరమని షరపోవా వర్తమాన స్థితి గమనించినవారికి అర్ధమవుతుంది.