
చింతలపూడిలో దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్, ప్రమాదంలో గాయపడిన వ్యక్తి
పశ్చిమగోదావరి ,చింతలపూడి : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకులు పనిచేయకపోవడంతో పాటు స్టీరింగ్ పట్టేయడంతో బస్సు పక్కనే ఉన్న బజాజ్ షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు డిపోకు చెందిన బస్సు చింతలపూడి మీదుగా అశ్వారావుపేట వెళుతోంది.
చింతలపూడిలో ప్రయాణికులను ఎక్కించుకుని బస్టాండ్ నుంచి బయలుదేరింది. టీటీడీ కల్యాణ మండపం సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి బజాజ్ షోరూమ్‌లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ జరగలేదు. ప్రమాదంలో కొక్కిరగడ్డ రాజశేఖర్, మెకానిక్ తేజ, వేమారెడ్డిలకు బలమైన గాయాలవ్వడంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో వేమారెడ్డిని ఏలూరు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు.