పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని
నెల్లూరు ( వైద్యం ) : జిల్లాలోని పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో శనివారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ పేషంట్లకు రెడ్‌క్రాస్ లేదా మెడికల్ కళాశాల పరిధిలో సేవలు అందించాల్సిన విషయాన్ని చర్చిస్తున్నామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి వారంలోగా నివేదికలు పంపాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.
సివిల్ సర్జన్ల విషయం
డీఎంఈతో చర్చిస్తా
జీఓ నంబరు 138తో తమకు అన్యాయం జరిగిందని సివిల్ సర్జన్లు మంత్రి కామినేనిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కొన్నేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్న తమను ఇతర జిల్లాలకు బదిలీచేయడంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అర్ధాంతరంగా బదిలీలు చేస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతాయని వివరించారు. స్పందించిన మంత్రి బదిలీలపై డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌తో చర్చిస్తానన్నారు.
వీలైనంత వరకు దగ్గరలో ఉండే ఆసుపత్రులలోనే సివిల్ సర్జన్లు పనిచేసేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీకాంత్, కమిషనర్ చక్రధర్‌బాబు, ఇన్చార్జి డీఎంహెచ్ఓ కోటేశ్వరి, ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు, డీసీహెచ్ఎస్ సుబ్బారావు, మెడికల్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌రెడ్డి, ఆర్ఎంఓ ఉషా సుందరి, వైద్యులు శాస్త్రి, నిరంజన్, కెఎస్ రాజు, రమణయ్య, నాయకులు రామకృష్ణారావు, శేషారత్నం పాల్గొన్నారు.