శ్రావ్యంగా సొంత గొంతు!
పుస్తక పరిచయం
రెండు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకుని, తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక పరిశోధన విభాగం అధిపతిగా ఉన్న ఆచార్య కర్రి సంజీవరావును తెలిసినవాళ్లు కొన్ని వందల్లో ఉంటారేమో. కానీ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రగాఢమైన, అనుభూతి ప్రధానమైన కవిత్వం రాస్తూ, సొంత గొంతులో దళితానుభూతిని ఆవిష్కరిస్తూ, అప్పుడప్పుడు సాహితీమూర్తులకు శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ వస్తున్న శిఖామణిని ఎరిగినవాళ్లు అనేక వేలల్లో ఉంటారు.
ఈ మధ్యనే శిఖామణి మూడు పుస్తకాలు అచ్చేసి, విడుదల చేశాడు. వాటిల్లో ఒకటి 2013-15 మధ్యకాలంలో అచ్చయిన కవితల సంకలనం (పొద్దున్నే కవి గొంతు). మరొకటి, పీహెచ్డీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి తను సమర్పించిన పరిశోధన పత్రం (తెలుగు మరాఠి దళిత కవిత్వం). వేరొకటి ముప్పయి నాలుగు మంది సాహిత్య జీవులకు ఘటించిన నివాళి (స్మరణిక). వీటిల్లో చివరి పుస్తకాన్ని తన ‘పంచమాతృకల స్మృతికి’, ‘తెలుగు మరాఠి దళిత కవిత్వం’ కలేకూరి ప్రసాద్ (యువక) స్మృతికి అంకితమివ్వడం బావుంది.
ఎన్ని రచనా రూపాల్లో తన ఉనికిని చాటుకున్నప్పటికీ, శిఖామణి ప్రాయికంగా కవి. అతని కవితా సంకలనాన్ని సాకల్యంగా పరిశీలిస్తే, శిఖామణి సాహితీ మూర్తిమత్వం ఆవిష్కృతమవుతుంది. అంతెందుకు -‘పొద్దున్నే కవిగొంతు’ పుస్తకంలోని ‘పులస స్వగతం’ కవిత చదివితే చాలు - అతని కవితాత్మ అర్థమైపోతుంది. (నా దగ్గిర ఇలాంటి మోక్షదాయికమైన సూక్ష్మాలు డజన్లకొద్దీ ఉన్నాయి. అవసరమైనవాళ్లు ఎప్పుడైనా సంప్రదించవచ్చు). కవి ఈ కవితా సంకలనాన్ని తన ‘గురువుగారు’ ఇస్మాయిల్కి అర్పించుకున్నాడు. తత్తుల్యుడైన కె.శివారెడ్డి గురించి రాసిన కవిత పేరే ఈ సంకలనానికి పెట్టుకుని తన ప్రపత్తి చాటుకున్నాడు. ఇస్మాయిల్ నుంచి శివారెడ్డి వరకూ విస్తరించిన సువిశాల కవితాత్మ శిఖామణిది. తర్వాత తర్వాత అది దళిత కవిత్వం వరకూ సాగింది, అది వేరే విషయం.
తన రచనా సంవిధానం గురించి కవిగారు ఈ సంకలనంలో ఓ కవిత రాశాడు (వాక్యం పలకాలి). శిఖామణి రాసే పద్ధతిని నరేటివ్ రీతి అనొచ్చునేమో. ఇది కవిత్వం కట్టినట్లు ఉండదు. కథ చెప్పినట్లు ఉంటుంది. ఈ సంకలనంలోని తొట్టతొలి కవిత ‘మురమళ్ల రేవు’ దీనికి నిదర్శనంగా ఉంది. జానపద, పౌరాణిక రచనల్లో ఎక్కువ భాగం ఈ రీతిలో రాసినవే. మన భావుకవుల్లోనూ చాలామంది ఈ పద్ధతిలో రాశారు. శ్రీశ్రీ రాసిన ‘భిక్షు వర్షీయసి’, ‘బాటసారి’ లాంటివి కూడా ఇదే కోవకి చెందుతాయి.
ఇక కుందుర్తి కథా కావ్యాలు రాయగా, శీలా వీర్రాజు ఏకంగా నవలా కావ్యమే(!) రాశారు. అయితే, శిఖామణి కవితలకీ ఇక్కడ చెప్పుకున్నవాటికీ రూపం వరకే పోలిక. సారం విషయానికొస్తే ఇతగాడు సమకాలీనుడు. ఈ సంకలనంలోని చిట్టచివరి కవిత ‘భీమ్ పాటే పాడతాను’ ఇందుకు రుజువు. ముప్పయ్యేళ్లలో పది కవితా సంకలనాలు విడుదల చేసిన శిఖామణి అదే ఉత్సాహం ఇక ముందు కూడా ప్రదర్శిస్తాడని ఆశ.
ఒక చిన్నమాట - ఈ మూడు పుస్తకాల్లోనూ అడుగడుగునా అచ్చుపుచ్చులు వేధిస్తున్నాయి. ఆచార్యులవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
- మందలపర్తి కిషోర్ 8179691822