పుష్కర ఘాట్లకు అదనపు నీరు
సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి..
22,500 క్యూసెక్కుల నీరు విడుదల
మాచర్ల: కృష్ణా పుష్కరాల సందర్భంగా డెల్టా పరివాహక ప్రాంతంలోని అన్ని పుష్కరఘాట్లలో నీరు ఉంచేందుకుగానూ ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టాకు మరింత నీటిని విడుదల చేయాలని కోరింది. పుష్కరాలు పూర్తయ్యే వరకు మొత్తం 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాలని కోరగా స్పందించిన కృష్ణాబోర్డు డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం వరకు 7500 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విడుదల చేస్తుండగా గురువారం సాయంత్రం 4 గంటలకు 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్‌ఎల్‌బీసీకు 800, కుడికాలువకు మంచినీటి అవసరాల నిమిత్తం 7069 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు జూరాల నుంచి 1,39,291 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం నీటి మట్టం 870 అడుగులకు చేరుకుంది. అయితే పుష్కర సమయంలో సాగర్ రిజ ర్వాయర్ నుంచి, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం విడుదల అవుతున్న నీరు ఘాట్లకు పూర్తిగా లేవని గుర్తించిన ప్రభుత్వం అదనంగా నీటిని డెల్టాకు జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదల చేయాలని కోరడంతో 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఏ ఒక్క పుష్కర ఘాట్‌కు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం సాగర్ రిజ ర్వాయర్కు శ్రీశైలం నుంచి 73850 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ప్రధాన జల విద్యుత్కేంద్రం, కుడికాలువ, ఎస్ఎల్బీసీలకు 30,373 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 507.70 అడుగులు ఉండగా ఇది సుమారు 128 టీఎంసీలకు సమానం.