నిర్భయ కేసు నమోదు..డాక్టర్ అరెస్టు
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): మైనర్ బాలికపై అత్యాచార యత్ననికి పాల్పడిన డాక్టర్ రాంగోపాల్‌రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సంఘటనా స్ధలంలో అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ రవీంద్ర, బాధితుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద , నిర్భయ సెక్షన్ 376,354ఎ, ఫోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల మేరకు రాజమహేంద్రవరంలోని ఆదిత్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలికపై ఒక వైద్యుడు అత్యాచారయత్నం చేశాడు. రాజమహేంద్రవరంలోని శ్రీరామనగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక నాన్నమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆమె మానసికంగా కుంగుబాటుకు లోనైంది. ప్రభుత్వ కార్మిక ఆస్పత్రిలో(ఈఎస్ఐ)చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈఎస్ఐ అనుబంధ ఆసుపత్రి అయిన స్థానిక దానవాయిపేటలోని ఆదిత్య ఆసుపత్రిలో ఈనెల 7వ తేదీన చేర్చారు.
ఆదివారం ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు డాక్టర్ రాంగోపాలరెడ్డి వచ్చి బాలిక అత్తను బయటకు పంపి బాలికను డాక్టర్ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆమె ఎదురుతిరగడంతో శరీరంపైన పలుచోట్ల గాయపరిచాడు. ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలోకి వచ్చి బాలికను పిలవడంతో ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది. ఏమైందని అడిగేలోగా సదరు డాక్టర్ గదిలో నుంచే బయటకు వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని డాక్టర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.