ఎంపీ‘ఢీ’వో
కుర్చీకోసం ఇద్దరు ఎంపీడీవోల కుమ్ములాట
కుర్చీ నాదంటే..నాదేనని వాదులాట
సరూర్‌నగర్ మండలంలో విచిత్ర పరిస్థితి
సరూర్‌నగర్,న్యూస్‌లైన్: సాధారణంగా మండల అభివృద్ధి ఎవరి పరిధిలో ఉంటుందని అడిగితే టక్కున ఎంపీడీవో అని చెబుతాం. ఎక్కడైనా ఎంపీడీవో మండలానికి ఒక్కరే ఉంటారు. కానీ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో మాత్రం ఇద్దరు ఉన్నారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. అయితే ఒకరు అధికారులు బదిలీ చేశారని చెబుతుంటే.. మరొకరు కోర్టు ఉత్తర్వులు తనకే వచ్చాయని వాదులాడుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి..
ప్రస్తుత సరూర్‌నగర్ ఎంపీడీవో సబిత మూడునెలల క్రితం కల్వకుర్తి నుంచి బదిలీపై వచ్చారు. సబిత కంటే ముందు విధులు నిర్వర్తించిన శోభారాణి ఎన్నికల బదిలీల్లో భాగంగా మెదక్ జిల్లా వర్గల్ మండలానికి వెళ్లారు. ఇంతవరకు బానే ఉన్నా...ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. శోభారాణిని సరూర్‌నగర్ మండలానికి బదిలీ చేస్తూ జడ్పీ సీఈవో ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం ఆమె ఆర్డర్ కాపీతో వచ్చి ఎంపీడీవో సీట్లో కూర్చున్నారు.
అయితే శోభారాణి కంటే ముందే సబిత అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ధర్మాసనం ప్రస్తుతం ఏ మండలంలో కొనసాగుతున్నారో అదే మండలంలో విధులు నిర్వర్తించుకోవచ్చని తీర్పునిచ్చింది. అధికారుల నుంచి ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ తెచ్చుకున్న శోభారాణి, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న సబిత ఇరువురూ ఎంపీడీవో కుర్చీ తనదంటే ..తనదని వాదులాడుకున్నారు. తనకు రిలీవింగ్ ఆర్డర్ రాలేదని, ఉదయం నుంచి డ్యూటీలో ఉన్నానని.. పనినిమిత్తం బయటకెళ్లగానే శోభారాణి తన కుర్చీలో కూర్చోవటం దౌర్జన్యమని సబిత ఆరోపించారు.
శోభారాణి వచ్చీరాగానే.. సబిత పేరున వున్న నేమ్‌ప్లేట్‌ను తీసేసి, తన నేమ్‌ప్లేట్‌ను గోడకు అమర్చారు. ఈ వివాదం కార్యాలయంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకూ ఎంపీడీవో ఎవరో అర్థంగాక కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అధికారుల నుంచి ఆర ్డర్ కాపీ తెచ్చుకున్న శోభారాణి ఎంపీడీవోగా కొనసాగుతారా..? కోర్టు ఉత్తర్వులతో సబిత విధులు నిర్వర్తిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.