‘గాలి’ ట్యాంకు పేలి వ్యక్తి మృతి
♦ గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
♦ పంక్చర్ దుకాణం నిర్వాహకుడి నిర్లక్ష్యంతో ఘటన
♦ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బంధువులు
గండేడ్: గాలి ట్యాంకర్ పేలడంతో సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మహమ్మదాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరలా ప్రకారం.. గ్రామానికి చెందిన ఈడిగి గోవర్ధన్‌గౌడ్ (40) స్థానికంగా చిరు వ్యాపారంతోపాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా ఆయన మండలంలోని గాధిర్యాల్ రామానంద ఆశ్రమానికి నిత్యం వెళ్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం ఆయన స్థానికంగా ఉన్న రామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆయన ఇంటికి సమీపంలో అదే గ్రామానికి చెందిన హఫీజ్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడి కుమారుడు వసీద్ వాహనాలకు గాలి పెట్టేందుకు ఉన్న ట్యాంకును జనరేటర్‌తో స్టార్ట్ చేసి గాలి నింపుతున్నాడు. అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ట్యాంకు కెపాసిటీ కంటే గాలి ఎక్కువ కావడంతో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలిపోయింది. అదే సమయంలో, అటుగా వస్తున్న గోవర్ధన్‌గౌడ్ కాళ్లకు తగిలింది. తీవ్ర రక్తస్రావమైన అతడిని వెంటనే కుటుంబీకులు కట్టుకట్టి ఓ వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే గోవర్ధన్ మృతిచెందాడు. అయితే, గతంలో గాలిట్యాంకర్ రెండుసార్లు పేలింది. అప్పట్లో ఓ డాక్టర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా
పంక్చర్ దుకాణం నిర్వాహకుడి నిర్లక్ష్యానికి ఓనిండు ప్రాణం బలైపోయిందని మృతుడి కుటుంబీకులు, బంధువులు గోవర్ధన్‌గౌడ్ మృతదేహంతో అంతర్రాష్ర్ట లింకు రోడ్డుపై సుమారు 4 గంటల పాటు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. మహమ్మదాబాద్ ఎస్ఐలు రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్ మృతుడి కుటుంబీకులకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై టైర్లువేసి తగులబెట్టారు. మృతుడికి భార్య స్వరూప, కూతుళ్లు ఆనందమయి(5), చందన(2) ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పంక్చర్ దుకాణం యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.